రాష్ట్రంలో జిల్లాల విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు మరో రగడకు దారితీస్తుందా? విభజన అంశం మరో ఉత్పాతానికి పునాదులు వేస్తుందా? అంటే..ఔననే అంటున్నారు పరిశీలకులు. మరీ ముఖ్యంగా రాయలసీమ జిల్లాలను పార్లమెంటు స్థానాల ఆధారంగా విభజన చేస్తే.. పరిస్తితి ఉద్రిక్తతలకు దారీతీసే అవకాశం.. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు ఉద్యమం లేవనెత్తేందుకు అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ పరిణామాలను గమనిస్తున్న చాలా మంది మేధావులు సైతం.. ఇది వాస్తవమేనని అంటున్నారు. ప్రస్తుతం 8 పార్లమెంటు నియోజకవర్గాలు సీమ జిల్లాల్లో ఉన్నాయి.
మొత్తంగా సీమ ప్రస్తుతం నాలుగు జిల్లాలుగా ఉంటే.. రేపు జిల్లాల విభజన చేపడితే.. ఇది ఎనిమిదికి పెరుగుతుందని ప్రభుత్వ ఆలోచనలను బట్టి ఇప్పటి వరకు అవకాశం ఉంది. చిత్తూరులో తిరుపతి, చిత్తూరు, కడపలో రాజంపేట, కడప, అనంతపురంలో హిందూపురం, అనంతపురం, కర్నూలులో కర్నూలు, నంద్యాల పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో చాలా నియోజకవర్గాలు జిల్లా పరిధులు దాటి అంటే, కొన్ని కొన్ని పార్లమెంటు స్థానాలు రెండు జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలను విడదీస్తే.. ఇక్కడి ప్రజలకు సెంటిమెంట్ అస్త్రం అందించినట్టు అవుతుందన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఏదేమైనా జిల్లాల విభజన అంశం జగన్‌కు పెద్ద తలనొప్పిగా మారిందన్నది వాస్తవం.
నిజానికి ఇక్కడి ప్రజలు ఇప్పటికే తాము వెనుబడి ఉన్నామనే వాదనను తెరమీదికి తెస్తున్నారు.ఈ క్రమంలోనే 2012లో రాష్ట్ర విభజనకు ముందుగానే సీమ జిల్లాల విభజన చేపట్టాలనే ఉద్యమాన్ని తెరమీదకి తెచ్చారు. ఇప్పుడు జిల్లాల విభజన చేపట్టేందుకు ప్రభుత్వం సమాయత్తమైన నేపథ్యంలో తమ జిల్లాల పరిధులు దాటిపోయి.. తమను పక్క జిల్లాల్లో కలిపి.. మరో కొత్తజిల్లాగా ఏర్పాటు చేస్తే.. ఇక్కడి ప్రజలు ఒప్పుకొంటారా? అనేది కీలక సమస్య. అదేసమయంలో వెనుకబడి ఉన్న అనంతపురం జిల్లాలో కొత్తగా చేర్చే జిల్లా ప్రజలు కూడా ఇదే తరహా వివాదాన్ని తెరమీదికితెచ్చే ప్రయత్నం చేయొచ్చు.