ఏపీలో ప్రస్తుతం రైతులకు యూరియా కొరత ఏర్పడింది. దీంతో వైసిపి నేతలు “అన్నదాత పోరు” పేరిట ఈరోజు నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నారు. రైతులు, రైతు సంఘాలతో కలిసి అన్ని ఆర్డిఓ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలను చేపట్టాలని పార్టీ అధ్యక్షుడు జగన్ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరారు.

పంటలకు ఉచిత భీమాను పునరుద్ధరించాలని అన్నారు. వర్షాలతో నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ వెంటనే అందించాలని అధికారులకు వైసిపి నేతలు వినతి పత్రాలను అందించనున్నట్లుగా సమాచారం అందుతుంది. ఈ పిలుపు నేపథ్యంలో వైసిపి నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి ఎక్కడికి అక్కడ వైసిపి నేతలు అరెస్ట్ అవుతున్నారు. కాగా, మరోవైపు తెలంగాణలో కూడా యూరియా సమస్య విపరీతంగా ఏర్పడింది. చాలామంది రైతులు తెలంగాణలో నిరసన కార్యక్రమాలను చేపట్టారు. ఫెర్టిలైజర్ షాపుల ముందు గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడి ఆగ్రహం వ్యక్తం చేశారు.