వరుస వివాదాల కారణంగా
సీఎం జగన్ తరుచూ ఏదో ఒక
తలనొప్పిని భరిస్తూనే ఉన్నారు
సొంత జిల్లాలో తగదా ఓ వైపు
ఎయిడెడ్ విద్యా సంస్థలకు
ఫీజు రీయింబర్సుమెంటు చెల్లించని వైనం
ఇంకో వైపు..
రెండూ సున్నితమయిన అంశాలే!
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వరుసగా రెండు వివాదాల్లో ఇరుక్కున్నారు.ఈ రెండు కూడా అతి ముఖ్యమైనవే కావడం గమనార్హం. ఒకటి తన సొంత జిల్లా కడపకు సంబంధించిన వివాదం కాగా మరొకటి ఎయిడెడ్ పరిధిలో ఉన్న విద్యా సంస్థలకు సంబంధించింది. ఇక్కడ గత ఏడాది కాలంగా జగనన్న విద్యా దీవెన అందకపోవడం ప్రధాన సమస్యగా ఉంది. 2020 – 21 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటిదాకా ఎయిడెడ్ మరియు నాన్ ఎడిడెడ్ కళాశాలకు జగనన్న విద్యా దీవెన (ఫీజ్ రీ యింబర్స్ మెంట్) ఇంతవరకూ అందలేదు ఇదే ఇప్పుడు పెద్ద వివాదం అవుతోంది.
దీనిపై టీడీపీ ఫైర్ అవుతోంది.తమ హయాంలో బోధనా రుసుములను మూడు విడతలుగా విడుదల చేస్తే, అధికారంలోకి జగన్ వచ్చాక నాలుగు విడతలుగా నిధులు విడుదల చేస్తున్నారని,అయినా కూడా ఈ సౌకర్యం కొన్ని విద్యా సంస్థలకే వర్తింపజేసి మిగిలిన వాటికి వర్తింపజేయకపోవడం అన్యాయమని టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఎందరో విద్యార్థులు అన్యాయం అయిపోతున్నారని ఆవేదన చెందుతోంది.
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఐదు లక్షల మందికి పైగా విద్యార్థులకు విద్యాదీవెన పథకం వర్తింపజేయలేదని చెబుతూ, అందుకు తగ్గ ఆధారాలు సైతం తమ వద్ద ఉన్నాయని అంటోంది. 2019 – 20, 2020 -21 విద్యా సంవత్సరాలకు గాను కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు తమ ధ్రువీకరణ పత్రాలు తెచ్చుకోవాలంటే ఫీజు బకాయిలు చెల్లించాల్సి వస్తోందని, లేదంటే కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, జగన్ సర్కారు నిర్లక్ష్య వైఖరి కారణంగా పేద విద్యార్థులకు అప్పులే గతి అవుతున్నాయని టీడీపీ ఎమ్మెల్యేలు ఆవేదన చెందుతున్నారు.
ఇక మరో వివాదం ఏంటంటే కడప జిల్లా,ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో చదువుతున్న విద్యార్థులు నిన్నటి వేళ రోడ్డెక్కారు.ఇక్కడ చదువుతున్న పీ1,పీ2 విద్యార్థులు తమను కొత్త క్యాంపస్ ను వదిలి పాత క్యాంపస్ కు వెళ్లాలని చెబుతూ అధికారులు వేధిస్తున్నారని పేర్కొంటూ ధర్నాకు దిగారు. సరైన వసతులు లేని పాత క్యాంపస్ కు వెళ్లేదే లేదని పట్టుబట్టారు.ఇడుపులపాయ, ఒంగోలు ఇంజనీరింగ్ విద్యార్థులు కొత్త క్యాంపస్ కు వెళ్లాలని, పీ1,పీ2 విద్యార్థులు పాత క్యాంపస్ కు వెళ్లాలని వారంలోగా అంతా సర్దుబాటు చేస్తామని అధికారులు చెప్పినా కూడా విద్యార్థులు వినకుండా ఆందోళనలకు దిగారని ప్రధాన మీడియా వెల్లడిస్తోంది.
ఈ దశలో ఇక్కడి విద్యార్థినులకు, బోధనా సిబ్బందికి వాగ్వాదం నడిచింది.వీసీ కేసీరెడ్డి విద్యార్థినులతో ఫోన్లో మాట్లాడినా కూడా ఫలితం లేకపోయింది. ఓ దశలో ట్రిపుల్ ఐటీ అధ్యాపకురాలు ఒకరు దుర్భాషలాడారన్న ఆరోపణలు, విద్యార్థినులపై చేయి చేసుకున్నారన్న అభియోగాలు కూడా వచ్చాయి.దీంతో విద్యార్థులంతా తమ ఇళ్లకు వెళ్లిపోవాలని, ఆన్లైన్ క్లాసులకు హాజరు కావాలని వీసీ చెప్పినా కూడా సమస్య పరిష్కారం కాలేదని ప్రధాన మీడియాలో వార్తలొచ్చాయి.మరి! ఈ రెండు వివాదాలనూ జగన్ ఏ విధంగా పరిష్కరిస్తారో !