సర్కార్ బకాయిలకు జనాన్ని బలిచేస్తారా? : షర్మిల

-

మరోసారి కేసీఆర్‌ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల. తాజాగా ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్ జనాలకు గాల్లో మేడలు కట్టి ..తన కుటుంబానికి మాత్రం ఫామ్ హౌస్ కోటలు కట్టుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో ధనిక రాష్ట్రం తెలంగాణలోని ధనం మాయమైంది.. బంగారు తెలంగాణలో బంగారం మాయమైంది అంటూ షర్మిల మండిపడ్డారు. సర్కార్ చెల్లించాల్సిన బకాయిలకు జనాన్ని బలిచేస్తారా? అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఫాంహౌస్ పాలనకు తెలంగాణ ప్రజలు మూల్యం చెల్లించాలా ? అని నిలదీశారు. ప్రభుత్వ శాఖల కరెంటు బిల్లుల బకాయిలకు.. విద్యుత్ లైన్ల లోపాలకు.. కరెంట్ కొనుగోళ్ల అవకతవకలకు .. డిస్కంల తప్పిదాలకు .. జనాన్ని బలిచేస్తారా? జనం నడ్డి విరిచి బిల్లులు రాబడుతారా? అంటూ షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు.

‘‘కాళేశ్వరం పేరుతో ఎత్తిపోసిన నీళ్లను సముద్రంలో పోసి .. 9 వేల కరెంట్ బిల్లులను ఇప్పుడు జనం నెత్తిన మోపుతావా? కాసుల కక్కుర్తి కోసం ఎత్తిపోతల పేరుతో ఎత్తేసిన సొమ్ము ఒక పక్క వాటి నిర్వహణ భారం తలకు మించడం ఇంకోపక్క..మీ మోసం బద్దలైంది’’ అని షర్మిల వ్యాఖ్యానించారు. ‘‘ప్రభుత్వ శాఖల కరెంటు బిల్లు బకాయిలు 2014లో రూ.1302 కోట్లు ఉంటే 2022 నాటికి రూ.20,841 కోట్లకు ఎందుకు పెరిగాయి ? తప్పుడు విధానాలు.. దోచుకోవటమే తప్పించి.. ప్రజలకు మేలు చేసే సోయి లేని కేసీఆర్ స్వార్థ పాలనకు తెలంగాణ ప్రజల మీద పడనున్న భారం రూ.17వేల కోట్లు అంటున్నారు ? ఓటు వేసిన పాపానికి కేసీఆర్ ప్రజల నెత్తిన ఇంత భారం మోపుతున్నాడు’’ అని షర్మిల విమర్శించారు. 2014లో ఇరిగేషన్ శాఖ విద్యుత్ బకాయిలు రూ.107కోట్లు అయితే 2020 నాటికి రూ.9268 కోట్లకు పెరిగిందని.. మీ ధన దాహం తెలంగాణ ప్రజలకు శాపమైందన్నారు షర్మిల.

Read more RELATED
Recommended to you

Exit mobile version