తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు ప్రయత్నాల్లో ఉన్న వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు వైఎస్ అభిమానులను ఏకతాటిపైకి తెస్తూనే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాయా లేదా తెలుసుకునే పనిలో ఉన్నారు. ఇవాళ తెలంగాణలోని పలు యూనివర్సిటీ విద్యార్థులు, నిరుద్యోగులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో జగన్ తో విభేదాల పై షర్మిల ఓ మెసేజ్ ఇచ్చిందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తుంది.
తనకు పదవి ఎందుకు ఇవ్వలేదో వైఎస్ జగన్‌నే అడగండి అని వ్యాఖ్యానించారు షర్మిల..నేను పార్టీ పెట్టడం జగన్‌కు ఇష్టంలేదని పేర్కొన్న ఆమె..నాకు అమ్మ విజయమ్మ మద్దతు ఉందని ప్రకటించారు. వైఎస్ జగన్‌కు నాకు మధ్య విబేధాలో, భిన్నాభిప్రాయాలో తెలియదని సజ్జల మాట్లడిన మాటల పై కుండబద్దలు కొట్టారు. షర్మిల కామెంట్స్ తో జగన్‌కు, షర్మిలకు మధ్య విభేదాలు..తెలంగాణలో పార్టీ ఇతర వ్యవహారాల పై వైఎస్ కుటుంబంలో పెద్ద చర్చే నడిచిందా అన్న అంశం ఇప్పుడు తెరపైకి వస్తుంది.
జగన్‌కు, షర్మిలకు మధ్య గొడవలు ఎందుకు వచ్చాయి..సోదరుడితో షర్మిల విభేదించడానికి కారణం ఏమిటో షర్మిల తన బంధువులు, కుటుంబ శ్రేయోభిలాషులకు పూసగుచ్చినట్టు వివరించారు అని కొన్ని మీడియా సంస్థల్లో సైతం వార్తలు వచ్చాయి. అయితే షర్మిల నుంచి కానీ వారి సన్నిహితుల నుంచి కానీ దీనిపై ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈ వ్యవహారం పై నిన్నటివరకు కాస్త గందరగోళం నెలకొంది. ఇప్పుడు షర్మిల ఏకంగా తనకు పదవి ఎందుకు ఇవ్వలేదో జగన్‌నే అడగండి అని వ్యాఖ్యానించడం తనకు తల్లి విజయమ్మ అండగా ఉందని ప్రకటించడం చూస్తుంటే అన్నా చెల్లెలి మధ్య పూడ్చుకోలేని ఆగధమే ఏర్పడినట్లు అనిపిస్తుంది.
ఇప్పటికే వైఎస్ఆర్ అభిమానులతో సమావేశమవుతున్న ఆమె.. ఇప్పుడు యువతపై ఫోకస్ పెట్టారు..నా స్థానికతను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్, విజయశాంతి ఇక్కడి వాళ్లేనా అని ప్రశ్నించారు.. జయలలిత కూడా తమిళనాడు వాసి కాదని గుర్తుచేసిన షర్మిల.. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే.. పార్టీ వేరు.. ప్రాంతం వేరైనా.. అన్నా చెల్లెళ్లుగా మేం ఒక్కటే అని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చాక ప్రజల సమస్యలు తీరాయా? అమరవీరుల ఆశయాలు నెరవేరాయా అని సూటిగా ప్రశ్నించారు..అమరవీరుల త్యాగాలు స్మరిస్తూ వాళ్ల గడపకు వెళ్లి వస్తానని ప్రకటించారు.
మరోవైపు రైతు సమస్యలను కూడా ప్రస్తావించిన ఆమె..రైతుల సమస్యలపై ఢిల్లీకి వెళ్తానన్నారు..అయితే కేసీఆర్, వైఎస్ జగన్‌పై షర్మిల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.