షర్మిల పార్టీ ప్రకటన మరింత ఆలస్యం అవ్వనుందా ?

-

తెలంగాణలో రాజన్నరాజ్యం ఏర్పాటే లక్ష్యమని చెబుతున్న వైఎస్ షర్మిల పార్టీ స్థాపన కోసం క్షేత్రస్థాయిలో ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాల వైఎస్ అభిమానులతో లోటస్ పాండ్ వేదికగా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు షర్మిల. అయితే కొత్త పార్టీ ఏర్పాటు ప్రకటనకు ముహూర్తం కుదరడం లేదా..పార్టీ ప్రకటన పై నీలినీడలు కమ్ముకున్నాయా అన్న చర్చ మొదలైంది. ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినా అడుగడుగున అడ్డంకులతో అది జరిగే వరకు సస్పెన్స్ గానే ఉంది.

షర్మిల గత ఫిబ్రవరి 21నే ఖమ్మం జిల్లాలో పర్యటించి పార్టీ పేరును ప్రకటించాల్సి ఉండగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డొచ్చింది. దీంతో ఖమ్మం జిల్లా పర్యటనను షర్మిల వాయిదా వేసుకుని ఏప్రిల్ 9న ఖమ్మం జిల్లా కేంద్రంలోని పెవిలియన్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. బహిరంగ సభ ద్వారా పార్టీ పేరు, జెండా, అజెండా వివరించాలని భావించిన షర్మిల టీంకు కరోనా నిబంధనలు టెన్షన్ పెడుతున్నాయి. తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇప్పటికే పలు ఆంక్షలు విధించింది తెలంగాణ రాష్ట్రప్రభుత్వం.

గతంలో కంటే ఇప్పుడు రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉండటం..కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు పలు సూచనలు చేయడంతో ఇప్పుడు సభకు కఠిన ఆంక్షలు విధించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సభలు, సమావేశాలకు ఆంక్షలు పెట్టాలని ఆలోచన చేస్తోంది. అయితే లక్ష మందితో సభ నిర్వహించేందుకు వైఎస్ షర్మిల అనుచరులు చేస్తున్న ఏర్పాట్లకు ఇది పెద్ద విఘాతంలా మారనుంది. సభకు ఆంక్షలు అడ్డొస్తే ఏం చేయాలన్న దానిపై పార్టీలో చర్చ జరుగుతుంది.

ఇప్పటికే జిల్లాల వారిగా, సామాజికవర్గాల వారిగా ఆత్మీయ సమావేశాలు చేస్తూ వస్తున్నారు వైఎస్ షర్మిల. ఒకట్రెండు జిల్లాలు మినహా అన్ని జిల్లాలకు చెందిన వైఎస్ అభిమానులతో మీటింగ్ లు పూర్తి చేశారు. ఏప్రిల్ 9 వరకు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని 9వ తేదీన పార్టీ ప్రకటన చేయాలని కసరత్తు చేస్తున్నారు. అయితే షర్మిల ఏప్రిల్ 9వ తేదీ ఖమ్మం సభ, పార్టీ ప్రకటన పై షర్మిల పునరాలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో భారీ జన సమీకరణ చేస్తే అధిక సంఖ్యలో కరోనా బారిన పడే ప్రమాదం ఉండడంతో..పార్టీ ప్రకటన తాత్కాలికంగా వాయిదా పడే అవకాశం ఉంది.

మే 14 లేదా జూలై 8న పార్టీ పై ప్రకటన చేసే అవకశాలు ఎక్కువగా ఉన్నాయని ఆమె అనుచరులు చర్చించుకుంటున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version