ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు ఊకదంపుడు ఉపన్యాశాలు ఇవ్వడం.. సాధ్యాసాధ్యాలతో పనిలేకుండా వరాల జల్లులు కురిపించడం.. కుర్చీ ఎక్కాక విస్మరించడం తెలిసిందే. ఈ వ్యవహారం సామాన్యుడికి ప్రతీ ఐదేళ్లకోసారి అలవాటైపోయిన అంశంగా మిగిలిపోయింది. దీంతో ఎన్నికల్లో నాయకులు ఇచ్చిన హామీల విషయంలో మరీ ముఖ్యమైనవి, ట్రంప్ కార్డులు, ట్రబుల్ షూటర్ లాంటి కొన్నింటిని మాత్రమే ప్రభుత్వాలు హడావిడిగా అమలుచేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ విషయంలో జగన్ పద్దతి అంతా వేరే!!
ప్రజలకు హామీలు ఇచ్చేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి… ఒకసారి మాట ఇచ్చాక ఇంక ఆలోచించేది ఏమీ లేదు… జనం అడిగారా, ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించారా… వంటి వాటితో సంబంధం లేదు! అనుకున్న పథకాన్ని, ఇచ్చిన హామీని, అనుకున్న సమయానికి నెరవేర్చాల్సిందే అనే లెక్కలో జగన్ ముందుకుపోతున్నారు. కరోనా కష్టకాలంలో కూడా జగన్ తీసుకుంటున్న చర్యలు, అమలు చేస్తున్న పథకాలు ప్రతిపక్షాలతో పాటు పలువురిని విస్తుగొలుపుతున్నాయి! ఈ క్రమంలో జగన్ తాజా నిర్ణయం… “జనం మరిచిపోయారేమో కానీ జగన్ మాత్రం మరిచిపోలేదనే” కామెంట్ కు ఆస్కారం కల్పించింది!
వైద్యం ఖర్చు వేయి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీని వర్తింపు చేస్తామని జగన్ ఎన్నికల్లో హామీ ఇచ్చారు! ఈ సంగతి ఎంతమందికి గుర్తిండి ఉంటుంది? ఆరోగ్యశ్రీ గురించి గుర్తుండి ఉండొచ్చు కానీ… వైద్య ఖర్చు రూ.1000 దాటగానే అది ఆరోగ్యశ్రీలో చేరిపోతుందనే విషయాన్ని ఇప్పటికీ ఎంతమంది గుర్తుపెట్టుకుని ఉంటారు? తెలియదు కానీ… తాను ఇచ్చిన హామీలను జగన్ మరిచిపోవడం లేదు! వాటిని గుర్తుచేయాల్సిన అవకాశం ప్రతిపక్షాలకు లేకుండా చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా ఆరోగ్యశ్రీ వర్తింపును విస్తరిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీచేశారు.
ఇందులో భాగంగా… కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో వైద్యం ఖర్చు రూ.వేయి దాటితే ఆరోగ్యశ్రీ వర్తించనుంది. మరికొన్ని రోజుల్లో మిగిలిన జిల్లాలకు కూడా ఈ పథకం వర్తించనుంది! గత ప్రభుత్వ హయాంలో కేవలం 1,059 వైద్య ప్రక్రియలకు మాత్రమే ఆరోగ్యశ్రీ వర్తింపచేసేవారు. కానీ… ఈ విషయాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేసిన జగన్ సర్కార్… కొత్తగా మరిన్ని చేరుస్తూ మొత్తం 2,059 రోగాలకు ఆరోగ్యశ్రీని వర్తింపు చేసింది.
ఫలితంగా… “మాట ఇచ్చే ముందు ఆలోచించుకోవడమే తప్ప… ఇచ్చిన తర్వాత ఆలోచించేదేముంది.. చేసుకుపోవడమే” అని జగన్ నిరూపించినట్లయ్యిందని పలువురు అభిప్రాయపడుతున్నారు!! కరోనా కష్టకాలంలో.. అన్ని రాష్ట్రాలు ఆర్థిక ఇబ్బందులను సాకులుగా చూపిస్తూ ఎన్నో పథకాలకు పాతరేస్తున్న తరుణంలో… జగన్ ఇలా దూసుకుపోవడంపై “యాత్ర” సినిమాలోని ఈ డైలాగ్ ను జగన్ పాలనపై అప్లై చేస్తున్నారు జనం!