సంచలనం: కేంద్ర కేబినేట్ లోకి వైసీపీ?

-

దేశ రాజకీయాలు చాలా క్షణాల్లో మారిపోతున్నాయి. బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మిత్రపక్షం జేడీయూ కు కేబినెట్‌ లో చోటు కల్పించే దిశగా.. ప్ర‌ధాని నరేంద్ర మోడీ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎప్పుడు ఇలాంటి ప్రచారం జరిగినా కూడా.. “కేంద్రంలో వైసీపీకి కూడా కేబినేట్ అవకాశం ఉంది” అనే టాక్ నడుస్తోంది. సంవత్సరం కాలంగా “ఎన్డీఏలోకి వైసీపీ” అంటూ చాలా పుకార్లే వినిపించాయి. సీఎం వైఎస్‌‌ జగన్ – ప్రధాని మోడీతో భేటీ అయిన ప్రతిసారీ ఇలాంటి చర్చలు తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కేంద్ర కేబినెట్ లో వైసీపీ అనే విషయంపై సీరియస్ డిస్కషన్స్ నడుస్తున్నట్లు తెలుస్తోంది!

File Photo

అతి త్వరలో కేంద్ర కేబినెట్ లో వైసీపీ తరుపున ఇద్దరికి మంత్రి పదవులు ఖాయమంటూ అంటూ వార్తలు వస్తున్నాయి. కానీ… కేంద్రంతో జగన్‌ సర్కార్‌ మొదట్నుంచీ మంచి సంబంధాలే కొనసాగిస్తోన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే, రాష్ట్ర బీజేపీ నేతలు ఎంత కవ్వించినా, తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినప్పటికీ.. అవేం పట్టించుకోకుండానే తమదైన శైలిలో వైఎస్ జగన్ పాలన జరుపుతున్నారు. ఇది కూడా వ్యూహంలో భాగమేనని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

అదేవిధంగా లోక్‌ సభలో వైసీపీకి 22 మంది ఎంపీలు ఉండగా… రాజ్యసభలో ఆరుగురు సభ్యులున్నారు. దీంతో వైసీపీతో అధికారికంగా చేతులు కలిపేందుకు బీజేపీ అధిష్టానం అమితోత్సాహం చూపిస్తున్నట్టు సమాచారం అందుతుంది. అలాగే.. పార్లమెంటులో సంఖ్యాబలం చూసుకుంటే జగన్‌ కు బేరమాడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయినప్పటికీ కేంద్రంతో చేతులు కలపటానికి జగన్‌ సుముఖంగా లేనట్టుగానే ఎప్పటినుంచో వినిపిస్తున్న మాట. అందుకు ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి.

అవేమంటే.. ఒకటి వైసీపీ గెలుపు పునాదులు దళితులు, మైనార్టీ ఓట్‌ బ్యాంక్‌ పైనే ఉండడం. మరొకటి.. 2, 3 మంత్రి పదవుల కోసం తన రాజకీయ అస్థిత్వాన్ని దెబ్బతీసుకొనేందుకు జగన్‌ ఇష్టపడకపోవడంగా తెలుస్తోంది. కానీ… రెండో కారణం కూడా చాలా బలమైంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే ఎవరితో అయినా కలిసేందుకు సిద్ధమని గతంలో వైఎస్ జగన్ పలుసార్లు ప్రకటించారు. ప్రత్యేక హోదాపై ఎటువంటి భరోసా లేకుండా మాత్రం ఎన్డీఏలో చేరితే ప్రతిపక్షాల నుంచి ఇటు ప్రజల నుంచి కూడా గట్టి విమర్శలు ఎదుర్కోవలసి వస్తుందని భావిస్తున్నారు.

అందుకే మరోసారి బీజేపీ నుంచి ఆహ్వానం వచ్చినా.. దాన్ని సున్నితంగా తిరస్కరించే అవకాశాలే ఉన్నాయని సమాచారం. మరి ఇలాంటి సమయంలో వైఎస్ జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది!!

Read more RELATED
Recommended to you

Exit mobile version