అధికార పార్టీలో ఆయన మాజీ ఎమ్మెల్యే. ఉన్నది అధికార పార్టీలోనే అయినా ఆయన్ని ఎవరూ పట్టించుకోవడం లేదట. పార్టీలో ఉన్నాడా..లేదా..అన్నది కూడా అధికార పార్టీ నేతలు గుర్తించడం లేదు. దీంతో ఆయన ప్రతిపక్ష పార్టీలో చేరాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే ప్రతిపక్ష పార్టీలో చేర్చే బాధ్యత కూడా ఆయన తన అనుచరులపైనే పెట్టారు.
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు పొలిటికల్ ఫ్యూచర్ ని సరిదిద్దుకునే పనిలో పడ్డారట. ప్రస్తుతం అధికార పార్టీ వైసీపీలో డేవిడ్ రాజు ఉన్నారు. అయితే ఉన్నది అధికార పార్టీలోనే అయినా డేవిడ్ రాజుని ఎవరూ పట్టించుకోవడం లేదట. అధికార పార్టీ నేతలు డేవిడ్ రాజుని లైట్ తీసుకున్నారట. అధికార పార్టీ నేతలే డేవిడ్ రాజుని పట్టించుకోక పోవడంతో అధికారులు కూడా డేవిడ్ రాజుని అసలు గుర్తించడం లేదట. దీంతో డేవిడ్ రాజుకి పొలిటికల్ ఫూచర్ పై బెంగపట్టుకుందట. తిరిగి రాజకీయాల్లో యాక్టీవ్ అయ్యేందుకు డేవిడ్ రాజు ప్లాన్ చేస్తున్నారు. అయితే తన పొలిటికల్ ఫ్యూచర్ ని చక్కదిద్దే బాధ్యత డేవిడ్ రాజు తన పాత అనుచరులపై పెట్టారట.
డేవిడ్ రాజు పాలిటిక్స్ ఇప్పుడు ప్రకాశం జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి. గతంలో టీడీపీలో సంతనూతలపాడు ఎమ్మెల్యేగా, ఒక సారి జడ్పీ ఛైర్మన్ గా పాలపర్తి డేవిడ్ రాజు పని చేశారు. 2014ఎన్నికల సమయంలో సైకిల్ దిగి డేవిడ్ రాజు వైసీపీ కండువాకప్పుకున్నారు. ఆ ఎన్నికల్లో 30 వేలకు పైగా మెజారిటీతో డేవిడ్ రాజు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే టీడీపీ అధికారంలోకి రావడంతో ఎన్నికలు జరిగిన ఏడాదిన్నరకే డేవిడ్ రాజు తిరిగి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే గత ఎన్నికల్లో డేవిడ్ రాజుకి టీడీపీ హ్యాండ్ ఇచ్చింది. డేవిడ్ రాజుని పక్కన పెట్టి ఎర్రగొండపాలెం టీడీపీ టిక్కెట్ బూదాల అజితారావుకి ఇచ్చారు. దీంతో మనస్తాపం చెందిన డేవిడ్ రాజు 2019 ఎన్నికల సమయంలో తిరిగి వైసీపీలో చేరారు.
గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో డేవిడ్ రాజు తనకు ఏదో ఒక నామినేటెడ్ పదవి ఇవ్వాలని వైసీపీ నేతల చుట్టూ తిరిగారు. కానీ గత ప్రభుత్వంలో వైసీపీని వీడి వెళ్లిన డేవిడ్ రాజుని ఆపార్టీ నేతలు పూర్తిగా పక్కన పెట్టేశారు. పేరుకి అధికార పార్టీలో ఉన్నా..డేవిడ్ రాజుని ఎవరూ పట్టించుకోలేదు. దీంతో గత ఏడాది కాలంగా డేవిడ్ రాజు అధికార పార్టీలో అసంతృప్తితో ఉన్నారట. ప్రస్తుతం అధికార పార్టీలో అన్ని నియోజక వర్గాలు నాయకులతో నిండిపోయాయి. ఇప్పటికే రెండు సార్లు అటు..ఇటు తిరిగిన డేవిడ్ రాజు మరో సారి టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నారు.
అయితే ఇప్పటికే రెండు సార్లు టీడీపీని వీడి వైసీపీలో చేరిన డేవిడ్ రాజుని టీడీపీ నేతలు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదట. దీంతో ఎర్రగొండపాలెం టీడీపీలో ఉన్న తన పాత అనుచరుల్ని డేవిడ్ రాజు రంగంలోకి దించారట. ఒంగోలులో పాత అనుచరులతో సమావేశం అయిన డేవిడ్ రాజు..తిరిగి టీడీపీలో చేర్చే బాధ్యత కూడా వారికే అప్పగించారట. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో మాట్లాడి తనను తిరిగి టీడీపీలో చేర్చాలని కార్యకర్తలను వేడుకుంటున్నారట. ప్రస్తుతం ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ ఛార్జ్ గా ఎవరూ లేక పోవడంతో డేవిడ్ రాజు మరోసారి టీడీపీలో చేరి ఎర్రగొండపాలెం బాధ్యతలు చేపట్టాలని భావిస్తున్నారు. కానీ వరుసగా రెండు సార్లు టీడీపీని డేవిడ్ రాజు వదిలి వెళ్లడంతో మరో సారి అవకాశం ఇస్తారా…లేదా అన్నది జిల్లాలో ఆసక్తికరంగా మారింది.