వైసీపీలో చిత్రమైన పరిస్తితి ఏర్పడింది. ఇప్పటికే నిండుకుండలా ఉన్న నేతలతో పార్టీ కిటకిటలాడుతోం ది. ఎక్కడికక్కడ నాయకుల సంఖ్య భారీగా ఉంది. అయితే, వీరిలో చాలా మంది ఎలాంటి బాధ్యతలూ లేవు. దీంతో వీరంతా ఉసూరు మంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో వైసీపీ అధినేతగా ఉన్న సీఎం జగన్ వారికి పని కల్పించాలని కోరుతున్నారు. కానీ, ఆయనేమో.. మరో అజెండాను భుజాన వేసుకున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండకూడదని, ప్రస్తుతం ప్రతిపక్షంగా ఉన్న టీడీపీని పూర్తిగా నిర్వీర్యం చేసి, చంద్రబాబుకు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న హోదాను పీకేయాలని చూస్తున్నారు.
ఈ క్రమంలోనే టీడీపీకి చెందిన నాయకులను అవసరం లేకున్నా పార్టీలో చేర్చుకుంటున్నారు. ఎమ్మెల్యేలను పరోక్షంగా తన పార్టీవైపు తిప్పుకొంటున్నారు. అదే సమయంలో చిన్నా చితకా నేతలను నేరుగా పార్టీలో చేర్చకుని కండువాలు కప్పుతున్నారు. ఇది పార్టీకి ఏమేరకు మేలు చేస్తోందో తెలియదు కానీ, నియోజకవర్గాల్లో వైసీపీ వర్సెస్ టీడీపీ నేతల మధ్య వివాదాలకు దారితీస్తోంది. దీంతో వైసీపీ నాయకులు తల్లడిల్లుతున్నార. “మానాయకుడు మమ్మల్ని పట్టించుకోవడం లేదు..కానీ, టీడీపీ నుంచి కొత్త నేతలను తీసుకువచ్చి.. మా నెత్తిన రుద్దతున్నారు“ అని వైసీపీ నాయకులు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తు్న్నారు.
మరికొందరు నాయకులు… పార్టీకోసం మేం ఎంతో కష్టపడ్డాం. జగన్‌ను సీఎంగా చూడాలని అప్పటి అధికార పార్టీ టీడీపీ వేధింపులను కూడా తట్టుకుని పనిచేశాం. ఇప్పుడు మాకేం మిగిలింది. ఆయన సీఎం అయ్యారు. మేం బఫూన్‌లు అయ్యాం!“ అని నిష్టూరంగానే మాట్లాడుతున్నారు. ఈ పరిణామం దాదాపు సగానికిపైగా జిల్లాల్లో కొనసాగుతోంది. ఉన్నవారినే ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని మరికొందరు సీనియర్లు కూడా జగన్‌కు సూచిస్తున్నారు. అయినా కూడా ఎవరూ పట్టించుకోవడం లేదని అంటున్నారు.
ఇది పార్టీకి దీర్ఘకాలంలో మేలు చేయదని.. ఇప్పుడు కొత్తగా వచ్చిన వారు వారిపై ఉన్న కేసులు మాఫీ చేయించుకునేందుకు, లేదా వారి వ్యాపారాలను వృద్ధి చేసుకునేందుకు వస్తున్నారు తప్ప.. వైసీపీపై అభిమానంతో కాదనే వారు కూడా కనిపిస్తున్నారు. ఇలాంటి వాటికి ఇప్పటికైనా జగన్ అడ్డుకట్టవేయాలని కోరుతున్నారు. మరి జగన్ వింటారా? చూడాలి!
-Vuyyuru Subhash