అధికార వైసీపీ నేతలు.. చిక్కుల్లో పడుతున్నారా ? అనవసర విషయాల్లో అతిగా జోక్యం చేసుకుంటున్నా రా ? అదేసమయంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సైలెంట్ గా వేస్తున్న వలలో వైసీపీ నేతలు చిక్కుకుంటు న్నారా ? అంటే.. రాజకీయ విశ్లేషకులు అవుననే అంటున్నారు. రాష్ట్రంలో జగన్ పరిపాలన ప్రారంభించి ఏడాది పూర్తయింది. ఈ సమయంలో ఒకవైపు వైసీపీ అధినేత జగన్ సంబరాలు చేసుకుంటున్నారు. ప్రభుత్వం పరంగా ఈ ఏడాది కాలంలో తీసుకున్న నిర్ణయాలు మెజారిటీ ప్రజలకు అందిన విధానంపై ఆయన సమీక్షలు చేస్తున్నారు. రాబోయే కాలంలో తీసుకోవాల్సిన నిర్ణయాలపైనా ఆయన దూకుడుగా ముందుకు సాగుతున్నారు.
ఈ ఏడాది కాలంలో నిజానికి జగన్ అనేక సంచలన నిర్ణయాలు తీసుకుని, అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారు. అయినప్పటికీ.. కొన్ని చిక్కులు ఉండిపోయాయి. పోలవరం సహా మూడు రాజధానులు, మండలి రద్దు.. వంటి అంశాలు, ఎన్నికల కమిషనర్ తొలగించే ప్రక్రియ వంటివి కీలకంగా మారాయి. వీటి విషయంలోను.. ప్రభుత్వ పంచాయతీ భవనాలకు రంగుల మార్పు విషయంలోను, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టే విషయంలో కూడా కొందరు కోర్టులకు వెళ్లారు. సాధారణంగా కొన్ని కొన్ని విషయాలను కోర్టుల వరకు తీసుకువెళ్లారంటేనే ఆయా వ్యక్తుల వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయనే విషయాన్ని గమనించాలి.
ఆయా అంశాలపై కోర్టులు తీర్పులు ఎలా ఇచ్చినా.. ఆదేశాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు సంయమనంతో వ్యవహరించాలి. లేదా ఆయా అంశాలకు అనుగుణంగా వ్యవహరించాలి. నిజానికి ఇలాంటి విషయాల్లో ప్రతిపక్షాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సహజం. రాజకీయాల్లో ప్రత్యర్థులపై పైచేయి సాధించడమే నీతి. కనుక.. కొన్ని అంశాల్లో ఎంత బాధకలిగినప్పటికీ.. సంయమనమే ప్రధాన పరిష్కారం.. అది లేకుంటే.. కచ్చితంగా చిక్కులు కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. ఇప్పుడు వైసీపీ నాయకులు కూడా ఇలా చిక్కుల్లో పడ్డవారే అంటున్నారు పరిశీలకులు.
ముఖ్యంగా ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి నాయకులు, ప్రజా ప్రతినిధులు ఆచితూచి వ్యవహరించాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం కోర్టులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారనే పిల్‌పై హైకోర్టు 49 మందికి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ప్రతిపక్షం మైండ్ గేమ్ మరింత పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. మరి ఈ సమయంలోనే రాజకీయ నేతలు ఆచితూచి వ్యవహరించాలని కూడా సూచనలు అందుతున్నాయి. మరి ఏం చేస్తారో చూడాలి.