వైఎస్సార్ సీపీ నేతల మధ్య గ్యాప్ పెరుగుతుంది. ఎంపీ రఘురామకృష్ణం రాజు రాజధాని విషయంలో చేసిన వ్యాఖ్యలపై మంత్రి అవంతి కౌంటర్‌తో రాజకీయం వేడిగా మారింది.
వైఎస్సార్ సీపీ నేతల మధ్య పొలిటికల్ గ్యాప్ పెరుగుతోంది. ముఖ్యంగా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు వ్యవహారం ముదిరి పాకాన పడుతోంది. రాజధాని విషయంలో రఘురామ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. విశాఖను రాజధానిగా వద్దని అక్కడి మెజారిటీ ప్రజలు చెబుతున్నారని, కాబట్టి అమరావతినే కొనసాగించాలని ఇటీవల వైఎస్సార్ సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించా రు. వీటిపై కొంత ఆలస్యంగా మేలుకొన్న విశాఖకే చెందిన మంత్రి అవంతి తాజాగా కౌంటర్ ఇచ్చారు. ఉత్తరాంధ్ర విషయాల్లో జోక్యం చేసుకుంటే బాగోదని వార్నింగ్ ఇచ్చారు.
అంతేకాదు, జగన్ భిక్షతోనే రఘు రామ ఎంపీగా టికెట్ సాధించి విజయం సాధించారని చెప్పుకొచ్చారు. ప్రతిపక్షం కన్నా ఎక్కువగా విమర్శలు గుప్పిస్తున్నారని రఘును దుయ్యబట్టారు. నిజానికి ఇప్పటి వరకు రఘుకు కౌంటర్ ఇచ్చేందుకు వైఎస్సార్ సీపీ నాయకులు ఎవరూ ముందుకు రాలేదు. గతంలో నరసాపురం ప్రాంతానికి చెందిన నాయకులు విమర్శలు గుప్పించినా.. తాజాగా మాత్రం ఎవరూ స్పందించలేదు. ఈ నేపథ్యంలో స్పందించిన అవంతి.. చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. రఘు రామ కూడా సై! అన్నారు. అవంతిపై వార్నింగ్ టైపులో వ్యాఖ్యలు చేశారు.
అవంతి శ్రీనివాస్ భీమిలిలో కేవలం జగన్ చరిష్మాతోనే గెలిచారు. కానీ నా నియోజకవర్గంలో నా వ్యక్తిగత చరిష్మా కూడా కొంత తోడయింది. ఈ విషయం గతంలోనే చెప్పాను. ఇప్పుడు మంత్రికీ చెబుతున్నాను. అంటూ.. కొత్త వివాదానికి రెడీ అన్నట్టుగా వ్యాఖ్యలు చేశారు. ఎంపీ పదవికి రాజీనామా చేయాలన్సి అవసరం తనకు లేదని చెప్పారు. మొత్తానికి ఈ వ్యాఖ్యలు అవంతి వర్గంలో దుమారం రేపాయి. రఘురామ కన్నా ముందు నుంచే అవంతి రాజకీయాల్లో ఉన్నారు. 2014లోనే ఆయన అనకాపల్లి నుంచి ఎంపీగా ఉన్నారు. గతంలో భీమిలిలోనూ చక్రంతిప్పారు. అయితే, ఇప్పుడు అవంతిది ఏమీ లేదని చెప్పడం ద్వారా.. రఘు మరో వివాదానికి రెడీ అయినట్టు కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.