ప్రపంచమంతా కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ అమెరికాకు చెందిన ఫార్మా కంపెనీ మోడెర్నా శుభవార్త చెప్పింది. తమ కరోనా వ్యాక్సిన్‌కు గాను చివరి దశ ట్రయల్స్‌ను సోమవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో చివరి దశ ట్రయల్స్‌లో మొత్తం 30వేల మందిపై ప్రయోగాలు చేస్తారు. వారిలో సగం మందికి వ్యాక్సిన్ ఇస్తారు. మిగిలిన సగం మందికి ప్లేసిబో (డమ్మీ వ్యాక్సిన్) ఇస్తారు. దీంతో వ్యాక్సిన్ పనితనాన్ని పెద్ద ఎత్తున పరీక్షిస్తారు.
కాగా క్లినికల్ ట్రయల్స్‌తోపాటు వ్యాక్సిన్‌ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేందుకు ఇప్పటికే అమెరికా ప్రభుత్వం మోడెర్నాకు 1 బిలియన్ డాలర్ల భారీ ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో మోడెర్నా చివరి దశ ట్రయల్స్ అనంతరం ఈ ఏడాది చివరి వరకు మొత్తం 500 మిలియన్ల డోసులను సిద్ధం చేస్తుంది. 2021 ఆరంభం వరకు 1 బిలియన్ డోసులను ఉత్పత్తి చేస్తుంది.
ఇక మోడెర్నా తన కరోనా వ్యాక్సిన్‌కు గాను ఆరంభంలో చేపట్టిన ట్రయల్స్‌లో సత్ఫలితాలు వచ్చాయి. వ్యాక్సిన్ తీసుకున్న 45 మందిలో కరోనా వైరస్ యాంటీ బాడీలు ఉత్పత్తి అయ్యాయి. అవి వ్యాధిని రాకుండా అడ్డుకున్నాయి. కాగా మరోవైపు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనికాలు తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్‌కు చివరి దశ ట్రయల్స్‌ను చేపడుతున్నారు. దీంతో ఆ వ్యాక్సిన్ ఆగస్టులో అందుబాటులోకి వచ్చేందుకు అవకాశం ఉంది.