ఏపీ అధికార పార్టీ వైసీపీలో పరిస్థితి అంతా బ్రహ్మాండంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నా, లో లోపల మాత్రం నాయకులు మధ్య సమన్వయం లేకపోవడం, ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తూ ఉండటం, క్షేత్రస్థాయిలో అవినీతి వ్యవహారాలు వంటి ఎన్నో కారణాలతో చాలాకాలంగా వైసిపి ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఏపీ సీఎంగా ఉన్న జగన్ పార్టీ కార్యక్రమాలను పెద్దగా పట్టించుకోకుండా, పూర్తిగా పరిపాలనపై దృష్టి పెట్టడం, ప్రజా సంక్షేమ పథకాల అమలు విషయంపైనా, రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడం, రాబోయే ఎన్నికల్లోనూ వైసీపీకి తిరుగులేకుండా చేసుకునేందుకు, ఇలా ఎన్నో రకాలుగా కష్టపడుతూ వస్తున్నారు.
దీంతో పార్టీలో నాయకుల వ్యవహారాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేని పరిస్థితి నెలకొంది.ఇదే అదనుగా కొంతమంది ఇస్తాను రాజ్యాంగ వ్యవహరిస్తూ పార్టీకి చెడ్డపేరు తీసుకువచ్చే విధంగా వ్యవహరిస్తుండడం చర్చనీయాంశం అవుతోంది. ముఖ్యంగా ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేకపోవడం, ఒకరిపై ఒకరు ఆధిపత్యం చేసుకునేందుకు ప్రయత్నించడం , తమ నియోజకవర్గాల్లో ఎంపీలు అడుగుపెట్టకుండా అడ్డుకోవడం, అసలు ఎంపీలతో తమకు పని లేదు అన్నట్లుగా కొంతమంది వ్యవహరిస్తుండడం, ప్రోటోకాల్ సమస్యలు ఇలా ఎన్నో కారణాలతో అధికార పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
ముఖ్యంగా ఎంపీలు పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా నిఘా వర్గాల ద్వారా జగన్ కు సైతం సమాచారం అందింది. కొంతమంది ఎంపీలు పార్టీలో తమకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని, నియోజకవర్గ సమస్యల తో పాటు, ఎమ్మెల్యేల కారణంగా తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను జగన్ కు చెప్పుకునేందుకు ఆయన అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నా, అది దక్కకపోవడం ఇలా ఎన్నో వ్యవహారాలు వారిలో అసంతృప్తిని కలిగిస్తున్నాయి. సుమారు ఐదు మంది వరకు ఎంపీలు బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నట్లుగా వైసిపి అనుమానిస్తోంది. తాము ఎంపీలు గా గెలిచాము అన్న ఒక్క సంతృప్తి తప్ప, మిగతా ఏ విషయాలలోనూ ఆనందం దక్కడం లేదని, పార్టీ నియమ నిబంధనల కారణంగా సొంత వ్యాపారాలు దెబ్బతిన్నాయని కొంతమంది ఎంపీలు ఆవేదన చెందుతున్నారట.
అయితే ఢిల్లీలో బీజేపీ నేతలను రహస్యంగా కొంతమంది ఎంపీలు కలుస్తున్న వ్యవహారాలపై జగన్ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైసిపి నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు రెబల్ గా మారి, ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన బాటలో కొంతమంది వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న వ్యవహారాలపై ఇప్పుడు ఇంటెలిజెన్స్ ద్వారా జగన్ నిఘా ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఏది ఏమైనా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలపై జగన్ కాస్త ఫోకస్ పెంచకపోతే , రానున్న రోజుల్లో ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కోవాల్సి న పరిస్థితి తప్పదు అనే అభిప్రాయాలు సర్వత్ర వ్యక్తమవుతున్నాయి.
-Surya