- వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
అమరావతిః ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు దూకుడుగా ముందుకు సాగుతున్నాయి. అయితే, మొదటి నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు, రాష్ట్రంలోని అధికార పార్టీ వైసీపీకి పడటం లేదని అందరికీ తెలిసిన విషయమే. అయితే, ఇటీవల నిమ్మగడ్డ ఎన్నికల నిర్వహించడంపై తీసుకుంటున్న పలు నిర్ణయాల నేపథ్యంలో అధికార పార్టీ నేతలు ఆయన పై తీవ్ర ఆరోపణలు, విమర్శలతో విరుచుకు పడుతున్నారు.
తాజాగా వైసీపీ సీనీయర్ నేత, పార్లమెంట్ సభ్యులు విజయసాయి రెడ్డ.. నిమ్మగడ్డపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. “స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాలని 2018లోనే హైకోర్టు ఆదేశించినా నిమ్మగడ్డ పట్టించుకోలేదు. ఉమ్మడి రాష్ట్రంలో 2013లో ఆఖరిసారి ఎన్నికలు జరిగాయి. రెండున్నరేళ్లుగా బాబు డైరెక్షన్ ఇవ్వలేదని నిమ్మగడ్డ నిద్రపోయారు. ఇప్పుడు కరోనా టైంలో ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు” అంటూ విజయసాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు.
ఇక ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డపై అధికారా పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలను ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య.. విజయ సాయి రెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ.. “రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పినా, దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తగిన ఆదేశాలిచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం నిమ్మగడ్డ రమేష్‌పై దాడి కోనసాగిస్తూనే ఉంది. ఇది రాజ్యాంగ సంక్షోభమే. ఎటు దారితీస్తుందో చూద్దాం” అంటూ ట్వీట్ చేశారు.