‘సామాజిక న్యాయభేరి’ పేరిట వైసీపీ బస్సు యాత్రకు చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో.. నేటి నుంచి 4 రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. అయితే ముందుగా నేడు శ్రీకాకుళం జిల్లాలో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, మైనారిటీ వర్గాలకు చెందిన 17 మంది మంత్రులు పాల్గొంటారు. ఈ 4 రోజుల్లో నాలుగు చోట్ల అంటే.. విజయనగరం, రాజమండ్రి, నరసరావుపేట, అనంతపురంలలో వైసీపీ బహిరంగ సభలు నిర్వహించనుంది. నేడు శ్రీకాకుళంలోని ఏడు రోడ్ల జంక్షన్ వద్ద వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి యాత్రను వైసీపీ మంత్రులు ప్రారంభిస్తారు.
అనంతరం ఎచ్చెర్ల, రణస్థలం మీదుగా యాత్ర విజయనగరం చేరుకుంటుంది. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రులు మాట్లాడతారు. అనంతరం విశాఖపట్టణం చేరుకుంటారు. రేపు అక్కడ బయలుదేరి అనకాపల్లి జంక్షన్, యలమంచిలి, జగ్గంపేట మీదుగా రాజమహేంద్రవరం చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభ నిర్వహించిన అనంతరం తాడేపల్లిగూడెంలో బస చేస్తారు. 28న అక్కడి నుంచి బయలుదేరి ఏలూరు బైపాస్, హనుమాన్ జంక్షన్, గన్నవరం, విజయవాడ తూర్పు, చిలకలూరిపేట మీదుగా నరసరావుపేట చేరుకుని బహిరంగ సభ నిర్వహిస్తారు. ఆ రోజు రాత్రి నంద్యాలలో బస చేసి 29న కర్నూలు, డోన్, గార్లదిన్నె మీదుగా అనంతపురం చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రులు ప్రసంగించడంతో ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్ర ముగియనుంది.