ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల వర్గపోరులో ఆ ఎంపీ నలిగిపోతున్నరా !

-

అక్కడ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మధ్య ఆధిపత్య పోరు ఓ రేంజ్‌లో నడుస్తోంది. ఈ వర్గపోరు వల్ల పార్టీ కార్యకర్తలు, ప్రజలకంటే ఎక్కువగా అక్కడి ఎంపీ నలిగిపోతున్నారట. ఎవరివైపు మొగ్గు చూపితే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయోనని తెగ ఫీలవుతున్నారట ఎంపీ పాటిల్.

జహీరాబాద్‌లో 2018 ఎన్నికల్లో గెలిచి తొలిసారి ఇక్కడ గులాబీ జెండా ఎగరేశారు ఎమ్మెల్యే మాణిక్‌రావు. ఇదే నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి ఫరీదుద్దీన్‌ ఎమ్మెల్సీగా ఉన్నారు. వీరిద్దరికీ అస్సలు పడటం లేదనేది పార్టీలో వినిపించే టాక్‌. 1999, 2004లో ఇక్కడ నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా ఉన్న ఫరీదుద్దీన్‌ వైఎస్‌ క్యాబినెట్‌లో మంత్రిగా చేశారు. 2009లో జహీరాబాద్‌ ఎస్సీ రిజర్వ్డ్‌గా మారింది. మాజీ మంత్రి గీతారెడ్డి ఇక్కడికి షిఫ్ట్‌ అవడంతో.. ఫరీదుద్దీన్‌ తప్పుకోక తప్పలేదు. ఆ ఎన్నికల్లో హైదరాబాద్‌లోని అంబర్‌పేట నుంచి పోటీ చేసి ఓడిపోయారాయన.

2014 ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరిన ఫరీదుద్దీన్‌ ఎమ్మెల్సీ అయ్యారు. 2018 ఎన్నికల్లో మాత్రం గీతారెడ్డిని ఓడించి మాణిక్‌రావు ఎమ్మెల్యే కావడంతో జహీరాబాద్‌లో పరిస్థితులు మారిపోయాయని చెబుతారు. ఇక్కడ ఏ పనులు జరగాలన్నా తమ మాటే నెగ్గాలని మాణిక్‌రావు, ఫరీదుద్దీన్‌ ఇద్దరూ పట్టబడతారని సమాచారం. ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల విషయంలో ఇద్దరు నాయకుల మధ్య మనస్పర్థలు కూడా వచ్చాయి.

ఈ ఆధిపత్యపోరులో కార్యకర్తలు నలిగిపోతున్నట్టే జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ సైతం ఇబ్బంది పడుతున్నారట. జహీరాబాద్‌ నుంచి రెండోసారి ఎంపీ అయ్యారు పాటిల్‌. ఆయనకు ఎమ్మెల్యే మాణిక్‌రావు మద్దతివ్వడం ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌కు రుచించడం లేదట. వీళ్ల గొడవ పార్టీ పెద్దల వరకు వెళ్లినట్టు సమాచారం. కలిసి పనిచేసుకోవాలి చెప్పినా మార్పు లేదని అనుకుంటున్నారు. ఎంపీ సైతం ఎమ్మెల్సీ వర్గంపై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. జనం ఎన్నుకున్న ఎమ్మెల్యే, ఎంపీలకు ఎమ్మెల్సీ కనీసం గౌరవం ఇవ్వడం లేదని పాటివ్‌ వర్గం రుసరుసలాడుతోందట.

ఏదైనా పని ఉందని అధికారుల దగ్గర ఎమ్మెల్యే పంపితే.. ఆ పనిని ఎమ్మెల్సీ అడ్డుకుంటున్నారట. దీంతో ఎందుకొచ్చిన గొడవ అని ఎంపీ సైతం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ గొడవ మధ్య వేలు పెట్టడానికి సాహసించడం లేదట. లోక్‌సభ నియోజకవర్గ కేంద్రమైనా జహీరాబాద్‌కు రావడం లేదట. ఏదైనా పని ఉందని వచ్చినా.. ఆపని చూసుకుని వెంటనే వెళ్లిపోతున్నారట పాటిల్‌. కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా ఉందని ఇక్కడి రాజకీయ రగడను తలచుకుని బెంబేలెత్తిపోతున్నారట ఎంపీ.

రెండోసారి ఎంపీగా గెలిచిన పాటిల్‌ సీనియర్‌ రాజకీయ వేత్తగా పార్టీలో గుర్తింపు తెచ్చుకున్నారు. కాంగ్రెస్‌ హయాంలోనే మంత్రిగా చేసిన ఫరీద్దుదీన్‌ నేనేమైనా తక్కువ అని ప్రశ్నిస్తున్నారు. మధ్యలో నియోజకవర్గంలో తన పట్టు సడలకుండా చూసుకుంటున్నారు ఎమ్మెల్యే మాణిక్‌రావు. వీరి మధ్య ఎంపీ ఇరుక్కుపోవడమే పార్టీలో హాట్‌ టాపిక్‌గా మారిందట.

Read more RELATED
Recommended to you

Exit mobile version