పురుషుల్లో అనేక క్రియలను సరిగ్గా నిర్వర్తించేందుకు టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ అవసరం అవుతుంది. సంతానం కోసం కూడా ఈ హార్మోన్ కావాలి. దీని వల్లే శుక్ర కణాల ఉత్పత్తి పెరుగుతుంది. అయితే కొందరు పురుషుల్లో టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ తగినంతగా ఉత్పత్తి అవదు. దీంతో అనేక సమస్యలు వస్తుంటాయి. అలాగే హార్ట్ ఎటాక్‌ల బారిన కూడా పడుతుంటారు. కానీ ఆ హార్మోన్ తక్కువగా ఉన్నవారికి టెస్టోస్టిరాన్ థెరపీ చేయడం వల్ల అనేక సమస్యలను తగ్గించవచ్చని, ముఖ్యంగా హార్ట్ ఎటాక్‌ల బారిన పడే అవకాశాలు చాలా తగ్గుతాయని సైంటిస్టులు తేల్చారు.
జర్మనీ, ఖతార్ దేశాలకు చెందిన 800 మంది పురుషులకు 10 ఏళ్ల కాలంలో సైంటిస్టులు టెస్టోస్టిరాన్ థెరపీ చేశారు. వారిలో ఆ హార్మోన్ తక్కువగా ఉన్నవారికి దాన్ని రోజూ కొద్ది మోతాదులో ఇస్తూ వచ్చారు. ఈ క్రమంలో టెస్టోస్టిరాన్ థెరపీ తీసుకున్న వారిలో హార్ట్ ఎటాక్ లు వచ్చే అవకాశాలు 25 శాతం వరకు తగ్గినట్లు గుర్తించారు. అలాగే ఈ హార్మోన్ థెరపీ పొందిన వారు అధిక బరువు తగ్గారని, కొలెస్ట్రాల్, షుగర్ లెవల్స్ తగ్గాయని, లివర్ పనితీరు మెరుగు పడిందని తేల్చారు. అందువల్ల పురుషులకు టెస్టోస్టిరాన్ హార్మోన్ థెరపీ ఇవ్వడం వల్ల అనేక సమస్యలను రాకుండా ముందుగానే అడ్డుకోవచ్చని సైంటిస్టులు తెలిపారు.
అయితే టెస్టోస్టిరాన్ హార్మోన్ స్థాయిలు తక్కువగా ఉన్నవారికి థెరపీ చేస్తేనే పైన తెలిపిన ప్రయోజనాలు కలుగుతాయని, అదే హార్మోన్ సాధారణ స్థాయిలో ఉంటే ఈ థెరపీ చేయకూడదని సైంటిస్టులు చెబుతున్నారు. ఇక మొత్తం 800 మందిలో సగం మంది థెరపీ తీసుకోలేదు. దీంతో వారిలో హార్ట్ ఎటాక్ కారణంగా 70 మంది చనిపోయారు. అలాగే 59 మంది ఇతర స్ట్రోక్స్ వల్ల చనిపోయారు. సుదీర్ఘకాలం పాటు సైంటిస్టులు ఈ అధ్యయనం చేపట్టారు. దీని తాలూకు వివరాలను యురోపియన్ అసోసియేషన్ ఆఫ్ యూరాలజీ కాంగ్రెస్‌లో వెల్లడించారు.