కోవిడ్ 19 కాంటాక్ట్‌లను ట్రేస్ చేసేందుకు గాను కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య సేతు యాప్‌ను అందుబాటులోకి తీసుకురాగా.. ఇప్పటి వరకు ఆ యాప్‌ను సుమారుగా 9 కోట్ల మందికి పైగా తమ తమ ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకున్నారు. అయితే ఇకపై ఈ యాప్ సేవలను స్మార్ట్‌ఫోన్ సదుపాయం లేకున్నా ఉపయోగించుకోవచ్చు. ఫీచర్‌ఫోన్, ల్యాండ్‌లైన్ ఫోన్ ద్వారా కూడా ఆరోగ్యసేతును ఉపయోగించుకునేందుకు గాను కేంద్రం నూతనంగా ఓ టోల్‌ఫ్రీ నంబర్‌ను ప్రవేశపెట్టింది.
కేంద్ర ప్రభుత్వం ఫీచర్ ఫోన్లు, ల్యాండ్‌లైన్ ఫోన్లను ఉపయోగిస్తున్న వారి కోసం ”ఆరోగ్యసేతు ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (ఐవీఆర్ఎస్)” పేరిట నూతనంగా ఓ టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై ఆయా ఫోన్లు ఉన్నవారు కూడా ఆరోగ్య సేతు సేవలను ఉపయోగించుకోవచ్చు. అందుకు గాను వారు 1921 అనే నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. దీంతో ప్రజలకు కాల్ వస్తుంది. అందులో ఐవీఆర్ఎస్ ద్వారా అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తరువాత వారు కోవిడ్ 19 కాంటాక్ట్‌లకు దగ్గర్లో ఉన్నారా, వైరస్ సోకే అవకాశం ఎంత వరకు ఉంది.. అన్న వివరాలను ఎస్ఎంఎస్ రూపంలో పంపుతారు.
ఇక ఈ ఐవీఆర్ఎస్ సేవ మొత్తం 11 భారతీయ భాషల్లో ప్రజలకు అందుబాటులో ఉంది. కాగా ఓ ఫ్రెంచ్ హ్యాకర్ ఆరోగ్య సేతు యాప్ సురక్షితం కాదని, అందులో ఉన్న ప్రజల డేటాకు ముప్పు ఉందని చెప్పగా, దాన్ని కేంద్రం ఖండించింది. ఆ యాప్ పూర్తిగా సురక్షితమేనని తెలియజేసింది.