స్మార్ట్ ఫోన్ గేమింగ్ ప్రియులకు ఎంతగానో ఇష్టమైన పబ్‌జి మొబైల్ గేమ్ భారత్‌లో మళ్లీ లాంచ్ అవుతుందా ? అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదం వల్ల దేశ సమగ్రతకు భంగం కలుగుతందనే కారణంతో చైనా యాప్‌లను భారత్ గతేడాది నిషేధించింది. వాటిల్లో పబ్‌జి మొబైల్ గేమ్ కూడా ఒకటి. అయితే ఆ గేమ్‌ను ఇప్పుడు లాంచ్ చేయాలని చూస్తున్నారు.
పబ్‌జి మొబైల్ గేమ్‌కు గతంలో క్రాఫ్టన్ కంపెనీ పబ్‌జి మొబైల్ ఇండియా పేరు మార్చి మళ్లీ లాంచ్ చేయాలని చూసింది. కానీ అందుకు కేంద్రం అనమతులు ఇవ్వలేదు. ఒక చైనా కంపెనీ పేరు మార్చి వస్తే లాభం లేదని, అనుమతులు ఇవ్వలేమని కేంద్రం చెప్పింది. దీంతో ఆ తంతు అక్కడికి ముగిసింది. కానీ ఆ గేమ్ కు బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గా మళ్లీ పేరు మార్చారు. దీని పేరిట ఓ వెబ్‌సైట్‌ను రిజిస్టర్ చేశారు. పలు ఫొటోలు, వీడియోలు లీకయ్యాయి. దీంతో ఈ గేమ్ భారత్‌లో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.
అయితే పేరు మార్చినప్పటికీ గతంలోనే పబ్‌జి గేమ్‌కు అనుమతులు ఇవ్వలేదు. మరి ఇప్పుడెలా ఇస్తారు ? అనే విషయం సందేహంగా మారింది. కానీ క్రాఫ్టన్ మాత్రం గేమ్‌ను లాంచ్ చేస్తామనే ధీమాలో ఉన్నట్లు తెలిసింది. ఇక కొత్త గేమ్‌లో పేరెంటల్ కంట్రోల్స్, 18 ఏళ్ల వయస్సు కనీస నిబంధన, రోజుకు 3 గంటలకు పైగా గేమ్ ఆడితే లాక్ అవడం వంటి ఆప్షన్లను అందిస్తారని తెలుస్తోంది. ఇక ఈ గేమ్ ఎప్పుడు విడుదలవుతుందనే విషయాన్ని కూడా ప్రకటించలేదు. కానీ జూన్ నెలలో లాంచ్ చేస్తారని తెలుస్తోంది.