వాట్సాప్ అందుబాటులోకి తేనున్న కొత్త ప్రైవసీ పాలసీపై యూజర్లు అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది టెలిగ్రామ్ యాప్ వైపుకు మళ్లుతున్నారు. వాట్సాప్‌ను అన్ ఇన్‌స్టాల్ చేస్తున్నారు. అయితే ఇదే విషయంపై టెలిగ్రామ్ వ్యవస్థాపక సీఈవో పవెల్ డురోవ్ స్పందించారు. ఫేస్‌బుక్‌కు చురకలు అంటించారు.
టెలిగ్రామ్ వ్యవస్థాపక సీఈవో పవెల్ డురోవ్ వాట్సాప్ నూతన ప్రైవసీ పాలసీ అప్‌డేట్‌పై స్పందిస్తూ.. యూజర్లంటే ఫేస్‌బుక్‌కు మర్యాద లేదని, వారిని, వారి అభిప్రాయాలను గౌరవించాలని అన్నారు. తమ టెలిగ్రామ్ యాప్ ఎంత పాపులర్ అవుతుందో ప్రస్తుతం ఫేస్‌బుక్ టీం అంతా తెగ ఆలోచిస్తుందని అన్నారు. ఫేస్‌బుక్ అందుకు గాను మిలియన్ల డాలర్లను ఖర్చు చేయాల్సిన పనిలేదని, వారు అడిగితే తమ సక్సెస్ సీక్రెట్ ను వారికి చెబుతామని అన్నారు.
కాగా టెలిగ్రామ్ యాప్ అతి త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్ల యాక్టివ్ యూజర్ల మార్కుకు చేరనుంది. అయితే వాట్సాప్‌ను ప్రస్తుతం చాలా మంది తీసేస్తున్న తరుణంలో ఆ సంఖ్య ఇంకా ఎక్కువ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక వాట్సాప్ కూడా కొత్త ప్రైవసీ పాలసీపై యూజర్లు అసంతృప్తి చెందుతుండడంపై స్పష్టత ఇచ్చింది. తమ నూతన పాలసీ వల్ల యూజర్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపింది.