5జీ ఫోన్ల‌ను కొనాల‌ని చూస్తున్నారా..? ఇప్పుడే వ‌ద్దు.. ఎందుకో తెలుసుకోండి..!

-

మార్కెట్‌లో మ‌న‌కు ఇప్ప‌టికే దాదాపుగా అనేక కంపెనీల‌కు చెందిన 4జీ స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇక శాంసంగ్ ఈ మ‌ధ్యే గెలాక్సీ ఎస్20 సిరీస్‌లో 5జీ మోడ‌ల్ స్మార్ట్‌ఫోన్ల‌ను లాంచ్ చేసింది. త్వ‌ర‌లో ఆపిల్ కూడా 5జీ ఐఫోన్ల‌ను లాంచ్ చేయ‌నుంది. అలాగే వివో, రియ‌ల్‌మి ఫోన్లు 5జీ ఫోన్ల‌ను విడుద‌ల చేసే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాయి. అయితే ప్ర‌స్తుతం మ‌న దేశంలో ఇంకా 4జీ సేవ‌లే అందుబాటులో ఉన్నాయి. 5జీ సేవ‌లు రాలేదు. మ‌రి మార్కెట్‌లో మ‌న‌కు ఇప్ప‌టికే 5జీ ఫోన్లు అందుబాటులో ఉన్న నేప‌థ్యంలో అస‌లు 5జీ ఫోన్ల‌ను కొనాలా..? లేదంటే 4జీ ఫోన్ల‌నే వాడాలా..? అని చాలా మంది సందేహిస్తున్నారు. మ‌రి 4జీ లేదా 5జీ ల‌లో ఏ ఫోన్ల‌ను కొంటే బెట‌ర్‌..? అస‌లు 5జీ ఇప్పుడ‌ప్పుడే వ‌చ్చే అవ‌కాశం ఉందా.. లేదా.. అన్న వివ‌రాలను ఒక్క‌సారి ప‌రిశీలిస్తే…

ప్ర‌స్తుతం టెలికాం కంపెనీలు భారీ న‌ష్టాల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే టెలికాం విభాగానికి చెల్లించాల్సిన బ‌కాయిల‌ను చెల్లించ‌లేక ఆ కంపెనీలు తీవ్ర‌మైన న‌ష్టాల్లో కూరుకుపోయాయి. ఈ క్ర‌మంలో ప‌లు కంపెనీలు అస‌లు ఇక‌పై మ‌నుగ‌డ కొన‌సాగిస్తాయా.. లేదా.. అన్న విష‌యం సందిగ్ధంలో ప‌డింది. ఇలాంటి ప‌రిస్థితిలో టెలికాం కంపెనీలు ప్ర‌స్తుతం కార్య‌క‌లాపాల‌ను నిర్వ‌హించ‌డానికే చాలా ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్నాయి. మ‌రి ఇక 5జీ సేవ‌ల‌ను ప్రారంభించాలంటే అందుకు పెద్ద ఎత్తున పెట్టుబ‌డి పెట్టాల్సి ఉంటుంది. కానీ ప్ర‌స్తుత ప‌రిస్థితిలో టెలికాం కంపెనీలు భారీ పెట్టుబ‌డుల‌ను పెట్టే ప‌రిస్థితిలో లేవు. అలాంట‌ప్పుడు 5జీ సేవ‌ల‌ను ఆ కంపెనీలు ఇప్పుడ‌ప్పుడే అందుబాటులోకి తెచ్చే ప‌రిస్థితి లేద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ప్ర‌స్తుతం టెలికాం కంపెనీలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా 5జీ సేవ‌ల‌ను అందుబాటులోకి తేవ‌డం సాధ్య‌మ‌య్యే ప‌నికాదు. ఈ క్ర‌మంలో ఈ ప్ర‌క్రియ‌కు క‌నీసం మ‌రో 3 ఏళ్ల స‌మ‌యం అయినా ప‌డుతుంద‌ని విశ్లేషకులు అంచ‌నా వేస్తున్నారు. క‌నుక 5జీ సేవ‌లు ఇప్పుడ‌ప్పుడే వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి రావ‌ని, మార్కెట్‌లో 5జీ ఫోన్లు అందుబాటులోకి వ‌చ్చినా 5జీ నెట్‌వ‌ర్క్ వ‌చ్చేందుకు ఇంకా చాలా స‌మ‌యం ప‌డుతుంద‌ని వారు అంచ‌నా వేస్తున్నారు. క‌నుక వినియోగ‌దారులు 5జీ ఫోన్ల‌ను ప్ర‌స్తుతం కొనుగోలు చేయాల్సిన ప‌నిలేద‌ని వారు పేర్కొంటున్నారు..!

Read more RELATED
Recommended to you

Exit mobile version