సుప్రీం కోర్టు నెత్తినోరు మొత్తుకుంటున్నది.. బాదుకుంటున్నది.. అయ్యా బాబులు.. ఆధార్ అన్నింటికీ తప్పనిసరి కాదు.. అని కానీ ఎవరన్నా వింటే కదా. కేంద్ర ప్రభుత్వం అయితే అసలు ఆధార్ ను ఎవరు ఎలా దుర్వినియోగం చేస్తున్నా పట్టించుకోదు. అందుకే ప్రతిఒక్కరు ఆధార్ లేకుంటే మనం మనుషులం కూడా కాదనట్టు చూస్తున్నారు. చివరకు సిమ్ తీసుకోవాలన్నా ఆధారే. పిల్లలను స్కూల్ లో జాయిన్ చేపించాలన్నా ఆధారే.. చివరకు పిల్లలకు ట్యూషన్లు చెప్పే సంస్థలు కూడా ఆధార్ అడుగుతున్నాయంటే ఆధార్ ఎలా అన్నింటిలో భాగస్వామ్యం అయిందో చూడండి.
ఈ ఆధార్ వల్ల ఇప్పుడు కొత్తరకం సమస్య వచ్చి పడింది. పీఎఫ్ విత్ డ్రాకు ఆధార్ అడ్డంకిగా మారింది. ఇప్పుడంతా ఆన్ లైన్ సిస్టమ్ కదా. ఆన్ లైన్ లోనే పీఎఫ్ విత్ డ్రాయల్ ఆప్షన్ ను పెట్టారు. పీఎఫ్ అకౌంట్ తో ఆధార్ ను లింక్ చేసుకోవాలి. పాన్ కార్డు లింక్ చేసుకోవాలి. ఈ రెండు లింక్ చేసుకుంటేనే ఆన్ లైన్ లో విత్ డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆధార్, పాన్ కార్డుల్లో ఒకటే పేరు.. ఇతరత్రా సమాచారం కూడా సేమ్ ఉండాలి. ఏ మాత్రం తేడా ఉన్నా ఆన్ లైన్ లో యాక్సెప్ట్ చేయదు. దీంతో పీఎఫ్ విత్ డ్రా చేసుకునే అవకాశమే ఉండదు. ఇంకో విషయం ఏంటంటే.. ఒకవేళ మీరు ముందే ఆధార్ ను పీఎఫ్ అకౌంట్ కు లింక్ చేసుకొని తర్వాత ఆధార్ లో ఏవైనా మార్పులు చేయించి.. ఆ మార్పులను మళ్లీ పీఎఫ్ అకౌంట్ లో మార్చాలన్నా కుదరదు. సిస్టమ్ తీసుకోదు. అది కూడా సమస్యే.
ఇలా.. ఆన్ లైన్ సమస్యతో ఓ వ్యక్తి సెటిల్ మెంట్ అప్లికేషన్ ను పీఎఫ్ అధికారులు తిరస్కరించారు. ఒడిశాలోని మయూర్ బంజ్ జిల్లాలోని బరిపడాకు చెందిన సంతోశ్ అనే వ్యక్తి విద్యుత్ సంస్థలో పనిచేసేవాడు. తనకు పీఎఫ్ అకౌంట్ ఉంది. పీఎఫ్ అమౌంట్ విత్ డ్రా చేసుకుందామని ఆన్ లైన్ లో అప్లికేషన్ పెట్టుకున్నాడు. సెటిల్ మెంట్ కోసం ఆఫీసుకు వెళ్లాడు. దీంతో అధికారులు అతడి అప్లికేషన్ ను తిరస్కరించారు. ఆధార్ కార్డులో తప్పులున్నాయని.. సమాచారం మ్యాచ్ కావడం లేదంటూ అతడికి పీఎఫ్ అమౌంట్ ఇవ్వడానికి తిరస్కరించారు. దీంతో మనోడి ఆశలన్నీ అడియాశలయ్యాయి. డబ్బులు అవసరమై పీఎఫ్ డబ్బులు తీసుకుందామని వెళ్తే వాళ్లు డబ్బులు ఇవ్వట్లేదని.. డబ్బులు ఉన్నా తీసుకోలేని పరిస్థితి దాపురించిందని ఆయన మీడియా ముందు వాపోయాడు. మీరు కూడా మీ పీఎఫ్ అకౌంట్, ఆధార్ డిటెయిల్స్ సరిగ్గా మ్యాచ్ అయ్యాయో లేదో చూసుకోండి. లేదంటే మీరు కూడా పీఎఫ్ విత్ డ్రా సమయంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.