పర్మినెంట్ అకౌంట్ నంబర్ (పాన్) కార్డు అనేది ప్రస్తుతం చాలా మందికి అవసరం అవుతోంది. పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు నిర్వహించినప్పుడు, లోన్లు, క్రెడిట్ కార్డులు తీసుకున్నప్పుడు, ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు పాన్ కార్డు కచ్చితంగా అవసరం అవుతుంది. అయితే కొందరు ఒకటి కన్నా ఎక్కువ పాన్ కార్డులను వాడుతుంటారు.
తమ క్రెడిట్ హిస్టరీ బాగా లేకపోతే లోన్లు, క్రెడిట్ కార్డులు ఇవ్వరని చెప్పి కొందరు పాత పాన్ కార్డును వదిలేసి కొత్తగా మళ్లీ పాన్ కార్డులను తీసుకుంటుంటారు. ఇక పాన్ కార్డులు పోయిన వారు, పెళ్లి చేసుకున్న మహిళలు పాన్ కార్డులలో వివరాలను అప్డేట్ చేసి డూప్లికేట్ కార్డులను పొందాల్సింది పోయి కొత్తగా కార్డులను తీసుకుంటారు. అందువల్లే కొందరికి ఒకటి కన్నా ఎక్కువ పాన్ కార్డులు ఉంటాయి. అయితే చట్ట ప్రకారం ఇలా ఒకటి కన్నా ఎక్కువ పాన్ కార్డులను కలిగి ఉండడం నేరం. అందుకుగాను రూ.10వేల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆ ఇబ్బంది ఎందుకని అనుకునేవారు తమకున్న పాన్ కార్డులలో ఏదైనా ఒక కార్డును దగ్గర పెట్టుకుని మిగిలిన వాటిని క్యాన్సిల్ చేయవచ్చు. అందుకు ఏం చేయాలంటే…
* ముందుగా ఎన్ఎస్డీఎల్ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అందులో Application Type అనే డ్రాప్‌డౌన్ నుంచి Changes or Correction in existing PAN Data/Reprint of PAN Card (No changes in existing PAN Data) అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
* ఫాంలో వివరాలను నింపి సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. అనంతరం ఓ టోకెన్ నంబర్ వస్తుంది. దాన్ని ఈ-మెయిల్‌కు పంపిస్తారు.
* టోకెన్ నంబర్‌ను రాసి పెట్టుకోవాలి. అది భవిష్యత్తులో రిఫరెన్స్‌కు ఉపయోగపడుతుంది. తరువాత Continue with PAN Application Form అనే బటన్‌పై క్లిక్ చేసి ముందుకు కొనసాగాలి.
* అనంతరం ఓ కొత్త వెబ్ పేజీకి రీడైరెక్ట్ అవుతారు. అందులో పై భాగంలో Submit scanned images through e-Sign అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
* మీరు దగ్గర ఉంచుకోవాలనుకునే పాన్ నంబర్‌ను తెలియజేయాలి. అనంతరం వ్యక్తిగత వివరాలను, ఇతర వివరాలను ఫాంలో నింపాలి.
* మీరు వద్దనుకునే, క్యాన్సిల్ చేయాలనుకునే పాన్ కార్డుల వివరాలను నమోదు చేయాలి. అనంతరం Next అనే బటన్‌పై క్లిక్ చేసి ముందుకు కొనసాగాలి.
* ఐడీ ప్రూఫ్, రెసిడెన్స్, డేట్ ఆఫ్ బర్త్ వంటి వివరాలను నమోదు చేయాలి.
* మీ ఫొటోగ్రాఫ్, సిగ్నేచర్ తదితర పత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. పాన్‌ను సరెండర్ చేస్తుంటే అక్నాలెడ్జ్మెంట్ రశీదుపై సంతకం చేయాలి.
* అన్ని వివరాలను నమోదు చేశాక అప్లికేషన్ ఫాం ప్రివ్యూ వస్తుంది. అందులో వివరాలను ఒక్కసారి తనిఖీ చేసుకోవాలి. అన్నీ సరిగ్గా ఉన్నాయనుకుంటే ఓకే. లేదంటే ఎడిట్ చేయాలి. తరువాత పేమెంట్ చేసేందుకు ముందుకు కొనసాగాలి.
* డీడీ, క్రెడిట్, డెబిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి ఆప్షన్లతో పేమెంట్ చేయవచ్చు.
* పేమెంట్ విజయవంతం అయ్యాక అక్నాలెడ్జ్మెంట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాన్ని సేవ్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు. పేమెంట్ చేసినట్లు ప్రూఫ్ గా అది పనిచేస్తుంది. అలాగే దాన్ని భవిష్యత్తులో రిఫరెన్స్ కోసం కూడా ఉపయోగించుకోవచ్చు.
* ప్రింట్ చేయబడిన అక్నాలెడ్జ్మెంట్ కాపీని రెండు ఫొటోలతో ఎన్ఎస్డీఎల్ ఇ-గవ్కు పంపించాలి. లెటర్ ఎన్వలప్‌పై Application for PAN cancellation అని రాయాలి. అలాగే అక్నాలెడ్జ్మెంట్ నంబర్‌ను వేయాలి. సంతకం చేసిన అక్నాలెడ్జ్మెంట్, డీడీ (అవసరం అయితే), ఇతర పత్రాలను పంపించాలి.
ఆఫ్‌లైన్‌లో క్యాన్సిల్ చేయడం ఇలా
ఒకటి కన్నా ఎక్కువ పాన్ కార్డులు ఉంటే వాటిని ఆఫ్‌లైన్ విధానంలోనూ సరెండర్ చేయవచ్చు. అందుకు గాను ఫాం 49ఎ లేదా Change or Correction in PAN ఫాంను ఉపయోగించవచ్చు. అనంతరం ఫాంలను సమీపంలో ఉండే యూటీఐ లేదా ఎన్ఎస్డీఎల్ టిన్ కేంద్రాలలో అందించవచ్చు. అలాగే ఇన్‌కమ్‌ట్యాక్స్‌ను ఫైల్ చేసే మీ చట్ట పరిధిలోని అసెసింగ్ ఆఫీసర్‌కు లెటర్ రాయాలి. అందులో పాన్ కార్డు నంబర్లు, పుట్టిన తేదీ వంటి వివరాలను తెలపాలి. అనంతరం ఆ లెటర్‌ను సమీపంలో ఉండే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్‌లో అందజేయాలి. దీంతో మీరు వద్దనుకునే పాన్ కార్డులను రద్దు చేస్తారు.