ఆన్‌లైన్ పేమెంట్ విధానం వచ్చాక ఒకరు మరొకరికి డబ్బును పంపించడం చాలా తేలికైంది. ఫోన్ లేదా కంప్యూటర్‌లో మొబైల్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా డిజిటల్ వాలెట్ల ద్వారా ప్రస్తుతం అధిక శాతం మంది నగదును ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. అయితే అంతా బాగానే ఉంది కానీ.. డబ్బును పొరపాటున ఒకరికి కాకుండా ఇంకొకరికి పంపితేనే అసలు సమస్యంతా వస్తుంది. అలాంటి సందర్భాల్లో ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
డబ్బును పొరపాటును ఇంకొకరికి ఆన్‌లైన్‌లో పంపితే దాన్ని తిరిగి తెచ్చుకునేందుకు పలు మార్గాలు ఉన్నాయి.
* మీరు పొరపాటున డబ్బు పంపిన వ్యక్తి అకౌంట్ కూడా మీ బ్యాంక్ లోనే ఉంటే పని తేలిగ్గా అయిపోతుంది. వెంటనే కస్టమర్ కేర్‌కు కాల్ చేసి లేదా బ్యాంక్ బ్రాంచ్‌ను సంప్రదించి విజ్ఞప్తి చేయవచ్చు. దీంతో 5 నుంచి 6 రోజుల్లోగా డబ్బులు రీఫండ్ అవుతాయి.
* మీరు డబ్బు పంపిన వ్యక్తి అకౌంట్ వేరే బ్యాంకులో ఉంటే అతను డబ్బు పంపేందుకు అంగీకరించాలి. దీంతో మీరు మీ బ్యాంక్‌ను సంప్రదిస్తే వారు ఆ వ్యక్తికి చెందిన బ్యాంక్‌కు రిక్వెస్ట్ పెడతారు. దీంతో 8 నుంచి 10 రోజుల్లోగా మీ డబ్బు వెనక్కి వస్తుంది.
* మీరు డబ్బు పంపిన వ్యక్తి అకౌంట్ వేరే బ్యాంకులో ఉండి, అతను ఆ డబ్బును పంపేందుకు అంగీకరించకపోతే అప్పుడు మీరు చట్ట పరంగా ముందుకు వెళ్లవచ్చు. అందుకు మీకు మీ బ్యాంక్ సహాయం అందిస్తుంది. మీ వివరాలను.. అంటే.. పేరు, చిరునామా, బ్యాంక్ బ్రాంచ్, మొబైల్ నంబర్, ఈ-మెయిల్, ఐడీ, అడ్రస్ ప్రూఫ్‌లు, ట్రాన్సాక్షన్ చేసిన తేదీ, సమయం, ట్రాన్సాక్షన్ మొత్తం వంటి వివరాలను సమర్పించి కోర్టుకు వెళ్లవచ్చు. దీంతో కోర్టు కేసును విచారించి డబ్బును పొరపాటుగా పంపినట్లు నిర్దారణకు వస్తే అప్పుడు అవతలి వ్యక్తులకు డబ్బును వెనక్కి ఇవ్వాలని చెబుతుంది. దీంతో మీ డబ్బులు వెనక్కి వస్తాయి.
అయితే చట్ట పరంగా ముందుకు వెళ్లే సందర్భాల్లో మీ డబ్బులు మీకు వెనక్కి వచ్చేందుకు కనీసం 2 నెలల సమయం పడుతుంది. కొన్ని సందర్భాల్లో అంతకన్నా ఎక్కువ సమయమే పట్టవచ్చు. అయితే మీరు పొరపాటున ఒకరికి పంపబోయి ఇంకొకరికి డబ్బు పంపితే అందుకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. బ్యాంకులు ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి బాధ్యత వహించవు. కాకపోతే మీకు కావాలనుకుంటే డబ్బులు రీఫండ్ వచ్చేందుకు సహాయ సహకారాలను మాత్రం అందిస్తాయి. కనుక ఆన్‌లైన్‌లో డబ్బులు పంపేటప్పుడు ఒకటికి రెండు సార్లు అన్ని వివరాలను తనిఖీ చేసుకోవడం మంచిది. లేదంటే ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది.