ప్రియాంక రెడ్డి హత్య.. “జీరో ఎఫ్‌ఐఆర్‌”పై డిమాండ్.. “జీరో ఎఫ్‌ఐఆర్” అంటే ఏమిటంటే..?

-

వెటర్నరి డాక్టర్ ప్రియాంక రెడ్డి దారుణ హత్య తరువాత ప్రజాలోకం ఒక్క సారిగా భగ్గుమంది. ఆమెపై అలాంటి దారుణానికి ఒడిగట్టిన నిందితులను కఠినంగా శిక్షించాలని, వారిని బహిరంగంగా ఉరి తీయాలనే డిమాండ్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం అటుంచితే.. ప్రియాంక రెడ్డి ఘటనకు సంబంధించి పోలీసులు మొదట నిర్లక్షంగా వ్యవహరించారనే ఆరోపణలు ఇప్పుడు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.

తమ పరిధి కాదంటే తమ పరిధి కాదని శంషాబాద్, శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ల సిబ్బంది ప్రియాంక కుటుంబ సభ్యులను తిప్పి పంపించారని తెలుస్తోంది. ఈ క్రమంలో పోలీసుల వైఖరిపై కూడా సర్వత్రా ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. అయితే నిజానికి పోలీసులు అసలు ఆ కేసు మాత్రమే కాదు, ఏ కేసు అయినా సరే.. ఎక్కడ సంఘటన జరిగినా సరే.. ఫిర్యాదు స్వీకరించాల్సిందే. బాధితులను తమ పరిధి కాదని తిప్పి పంపే అధికారం పోలీసులకు లేదు. ఎందుకంటే.. జీరో ఎఫ్‌ఐఆర్ పౌరులకు ఆ సదుపాయాన్ని అందిస్తోంది. ఇంతకీ అసలు జీరో ఎఫ్‌ఐఆర్ అంటే ఏమిటి..? అంటే..

 

జీరో ఎఫ్‌ఐఆర్ అంటే ఏమిటి..?

దేశంలో ఏ రాష్ట్రంలోనైనా సరే.. ఏ ప్రాంతంలో ఉన్న పోలీస్ స్టేషన్‌లో అయినా సరే.. బాధితులు తమకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేస్తే కచ్చితంగా వారి నుంచి ఫిర్యాదును తీసుకోవాలి. పోలీసులు తమ పరిధి కాదని బాధితులను తిప్పి పంపించరాదు. ఈ క్రమంలో ఒక వేళ తమ పోలీస్ స్టేషన్ పరిధిలో సంఘటన జరగకపోయి ఉంటే అప్పుడు వారు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి. ఇది సాధారణ ఎఫ్‌ఐఆర్‌లాగే ఉంటుంది. కాకపోతే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాక దాన్ని సంఘటన జరిగిన ప్రాంతానికి చెందిన పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేయాలి. దాన్నే జీరో ఎఫ్‌ఐఆర్ అంటారు. ఈ క్రమంలో బాధితులకు సత్వర న్యాయం అందుతుంది. అయితే ఈ జీరో ఎఫ్‌ఐఆర్ పట్ల నిజానికి ప్రజల్లోనే కాదు, చాలా మంది పోలీసులకు కూడా అవగాహన లేకపోవడం విచారకరం.

ఇక ప్రియాంక రెడ్డి ఘటన విషయానికి వస్తే.. బాధితురాలి కుటుంబ సభ్యులను పోలీసులు తమ పరిధి కాదని తిప్పి పంపిన నేపథ్యంలో ఇప్పుడు జీరో ఎఫ్‌ఐఆర్‌ను తెరపైకి తెచ్చారు. దేశవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలోనూ జీరో ఎఫ్‌ఐఆర్‌ను అమలు చేయాలనే డిమాండ్లు ఇప్పుడు బాగా వినిపిస్తున్నాయి. జీవో ఎఫ్‌ఐఆర్ గనక అమలు చేసి ఉంటే ప్రియాంక రెడ్డి కుటుంబానికి త్వరగా న్యాయం జరిగి ఉండేదని అంటున్నారు. మరి ప్రభుత్వాలు ఈ విషయంపై దృష్టి సారిస్తాయో లేదో చూడాలి..!

Read more RELATED
Recommended to you

Exit mobile version