రాజధాని వికేంద్రీకరణ పేరిట 3 ప్రాంతాల మధ్య చిచ్చు రేపుతున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే రాజధాని క్రీడ మొదలు పెట్టారని దుయ్యబట్టారు. రాజధాని బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపటంతో ఏర్పడిన పరిస్థితులు, తదుపరి కార్యాచరణపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ సమావేశంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. రాజధాని విషయంలో జగన్ ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. రాజధాని వికేంద్రీకరణ పేరిట 3 ప్రాంతాల మధ్య చిచ్చు రేపుతున్నారు. అమరావతి రైతుల కోసం ఆ ప్రాంతంలోని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, కృష్ణా, గుంటూరు జిల్లాల వైస్సార్సీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని తెలిపారు. అమరావతిపై చిత్తశుద్ధి ఉంటే ప్రత్యక్ష పోరాటంలోకి రావాలని, రైతు కన్నీరుపై రాజధాని నిర్మాణం వద్దని మొదట్నుంచి చెబుతున్నామని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే రాజధాని క్రీడ మొదలుపెట్టారని, రాజధాని వికేంద్రీకరణపై న్యాయకోవిదులు, నిపుణులతో చర్చిస్తాం అని అన్నారు.
ఏపీ రాజధాని వికేంద్రీకరణకు పూర్తిస్థాయి ప్రజామోదం కనిపించట్లేదని జనసేన పార్టీ అభిప్రాయపడింది. రాజధాని వికేంద్రీకరణపై న్యాయపోరాటం చేయాల్సిన సమయం వచ్చిందని జనసేన పేర్కొంది. ప్రజలు ఉద్యమించకుండా కొవిడ్ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయని తెలిపారు. వేల ఎకరాలను అమరావతి రైతులు ప్రభుత్వానికి ఇచ్చారని, ప్రభుత్వం మారగానే రాజధాని మారితే ప్రభుత్వం మీద ప్రజలకు భరోసా పోతుందని జనసేన ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సమావేశంలో జనసేన పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్, నాగబాబు, తోట చంద్రశేఖర్, పీఎసీ సభ్యులు పాల్గొన్నారు.