భారత ప్రభుత్వం తాజాగా 118 చైనా యాప్‌లను నిషేధించిన సంగతి తెలిసిందే. వాటిల్లో ప్రముఖ మొబైల్ గేమ్ పబ్జి కూడా ఉంది. లో ఎండ్ స్మార్ట్ ఫోన్ల కోసం డెవలప్ చేసిన పబ్జి లైట్ గేమ్‌ను కూడా బ్యాన్ చేశారు. అయితే మొబైల్ వెర్షన్‌కు చెందిన పబ్జి గేమ్‌ను బ్యాన్ చేసినా.. పీసీ వెర్షన్ పబ్జి గేమ్‌ను మాత్రం బ్యాన్ చేయలేదు. అవును.. పీసీ వెర్షన్ పబ్జి గేమ్ గేమింగ్ ప్రియులకు అందుబాటులో ఉంది.
ఐర్లాండ్‌కు చెందిన వీడియో గేమ్ డెవలపర్ బ్రెండాన్ గ్రీన్ మొదట పబ్జి గేమ్‌ను డెవలప్ చేశాడు. తరువాత దాన్ని దక్షిణ కొరియాకు చెందిన బ్లూ హోల్ కంపెనీ కొనుగోలు చేసింది. ఆ కంపెనీ పబ్జి గేమ్‌కు గాను పీసీ, కన్సోల్ వెర్షన్లను విడుదల చేసింది. అయితే పబ్జి గేమ్‌ను మొబైల్ వెర్షన్లో లాంచ్ చేసేందుకు గాను బ్లూహోల్ కంపెనీ చైనాకు చెందిన టెన్సెంట్ కంపెనీతో భాగస్వామ్యం అయింది. ఈ క్రమంలో టెన్సెంట్ కంపెనీ 2017లో పబ్జి గేమ్‌కు మొబైల్ వెర్షన్ ను డెవలప్ చేసి అందుబాటులోకి తెచ్చింది.
అయితే మొబైల్ వెర్షన్ లో ఈ గేమ్‌ను డెవలప్ చేసినందుకు గాను టెన్సెంట్ కంపెనీ బ్లూహోల్లో 1.5 శాతం వాటాను చేజిక్కించుకుంది. దీంతో అప్పటి నుంచి పబ్జి మొబైల్ వెర్షన్‌కు గాను ఆ రెండు కంపెనీలు సంయుక్త భాగస్వామ్యంలో గేమ్‌ను డెవలప్ చేస్తూ వచ్చాయి. వాటా మేరకు టెన్సెంట్ బ్లూహోల్ నుంచి ఆదాయం పొందుతోంది. అయితే ప్రస్తుతానికి పబ్జి మొబైల్ వెర్షన్‌ను మాత్రమే బ్యాన్ చేయగా, ఈ గేమ్‌కు చెందిన పీసీ వెర్షన్ ను ఇంకా బ్యాన్ చేయలేదు. అందువల్ల పీసీ వెర్షన్ ఇప్పటికీ గేమర్లకు అందుబాటులో ఉంది. అయితే దీనిపై కూడా బ్యాన్ విధిస్తారా, లేదా అన్నది తెలియాల్సి ఉంది.