పశు గ్రాసం కేసులో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్న ఆర్జెడి చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యంపై ఒక వైద్యుడు చేసిన ప్రకటన సంచలనం అయింది. ఆయనకు చికిత్స చేస్తున్న వైద్యుడు ఆయన ఆరోగ్యం గురించి మీడియాకు ప్రకటనలు జారీ చేయడం వివాదాస్పదంగా మారింది. లాలూ మూత్రపిండాల పనితీరు 25 శాతానికి దిగజారిందని, 4 వ దశలో ఉందని డాక్టర్ ఉమేష్ ప్రసాద్ పంచుకున్నారు.
ఈ పరిస్థితి మరింత దిగజారితే, లాలూకు డయాలసిస్ అవసరమని ఆయన చెప్పారు. లాలూ యాదవ్ ప్రస్తుతం రాంచీలోని రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) లో చికిత్స పొందుతున్నారు. అనధికారికంగా మీడియాతో సమాచారాన్ని పంచుకున్నందుకు డాక్టర్ ప్రసాద్ కు డైరెక్టర్ రిమ్స్ డాక్టర్ కామేశ్వర్ ప్రసాద్ షో-కాజ్ నోటీసులు జారీ చేశారు. “లాలూ ఆరోగ్యం గురించి ప్రచారం చేసిన సమాచారం అతని సొంత అభిప్రాయాలు” అని ఆయన స్పష్టత ఇచ్చాడు.
మెడికల్ బోర్డు మాత్రమే లాలూ ఆరోగ్యం గురించి సమాచారాన్ని అందిస్తుందని ఆయన అన్నారు. ఇంతలో, డాక్టర్ ఉమేష్ ప్రసాద్ మీడియాకు ఎటువంటి సమాచారం లీక్ చేయలేదని లిఖితపూర్వక ప్రకటనను విడుదల చేసారు. జార్ఖండ్ జైలు ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజి) బిరేంద్ర భూసన్ మాట్లాడుతూ లాలూ ఆరోగ్య స్థితిగతులపై డిసెంబర్ 10 వరకు ఇచ్చిన తాజా నివేదిక ప్రకారం ఎలాంటి ఇబ్బందులు లేవు అని గుర్తించినట్టు చెప్పారు.