మరో రెండు రోజుల్లో మహారాష్టలో ఎన్నికలు జరగనున్నాయి.. 23న ఫలితాలు వెలువడతాయి. సమయం తక్కువగా ఉండటంతో రెండు కూటములు తమ ప్రచారాలను వేగవంతం చేశాయి.. నువ్వా.. నేనా అన్నట్లుగా ప్రచారాల్లో దూకుడు పెంచాయి.. ఓటర్లను ఆకట్టుకునే హామీలను ఇస్తూ.. తమను గెలిపించాలని అభ్యర్దిస్తున్నాయి.. ఈ క్రమంలో పొలిటికల్ సర్కిల్ లో ఓ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.. మనోజ్ జరాంగే చుట్టూ మరాఠా రాజకీయాలు తిరుగుతున్నాయి..
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం అధికార మహాయుతి కూటమి, ప్రతిపక్షం మహావికాస్ అఘాడీ- ముమ్మర ప్రచారం చేస్తున్నాయి. అయితే మహారాష్ర్టలో ఇప్పుడు మనోజ్ జరాంగే పేరు మారుమోగిపోతుంది. గతేడాది వరకు సరిగ్గా పరిచయం లేని ఈ ఉద్యమ నేత.. ఈ ఎన్నికల్లో కీలకంగా మారారు. మరాఠా వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆయన అనేక ఉద్యమాలు చేశారు..
ఉద్యోగాల్లో మరాఠ యువతకు రిజర్వేషన్లు కల్పించాలని చేపట్టిన నిరాహార దీక్షతో సామాజిక కార్యకర్త మనోజ్ జరాంగే సూపర్ హీరోగా మారారు.. 288 అసెంబ్లీ స్తానాలున్న మహారాష్టలో దాదాపు 160 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్దుల తలరాతను మార్చే స్థాయిలో మరాఠీ ఓటర్లున్నారు.. రిజర్వేషన్ల కోసం ఆరుసార్లు దీక్షలు చేసిన మనోజ్.. ఆ సామాజికవర్గానికి నాయకుడిగా మారారు.. ఈ ఎన్నికల్లో మరాఠ్వాడా ప్రాంతంలో మనోజ్ ప్రభావం చూపే అవకాశముందన్న వాదన రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతోంది..
ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బిజేపీని గట్టిదెబ్బ కొట్టిన మనోజ్.. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రభావం చూపే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది. మరఠ్వాడాలో 40, పశ్చిమ మహారాష్టలో 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.. ఈ రెండు ప్రాంతాల్లో మనోజ్ జరాంగే కు ప్రజాదరణ ఉంది.. ఈ రెండు ప్రాంతాల నుంచి ఇప్పటి వరకు 9 మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు.. అందులో 8 మంది మరాఠవర్గానికి చెందిన వారే.. గతంలో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ కు, అప్పటి ఎన్సీపీకి హవా ఉండేది.. 2014 తర్వాత బిజేపీ, శివసేనలు వ్యూహాత్మక నిర్ణయాలతో ఇక్కడ పాగా వేశాయి.. ఈ క్రమంలో మరాఠాల ఓటు బ్యాంకును తమను అనుకూలంగా మలుచుకునేందుకు మహాయుతి పక్కా ప్లాన్ తో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది..