వరల్డ్ కిడ్నీ డే.. ప్రతి ఏటా మార్చి 11వ తేదీన ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లో కిడ్నీ వ్యాధులు, ఆరోగ్యం పట్ల అవగాహనను కల్పించేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే గత ఏడాది కాలంగా కరోనా వల్ల కిడ్నీ సమస్యలు ఉన్న బాధితుల సంఖ్య పెరిగిందని వైద్య నిపుణులు తెలిపారు. లాక్‌డౌన్ వల్ల చాలా మంది హాస్పిటళ్లకు వెళ్లలేకపోయారు. దీంతో సాధారణ హెల్త్ చెకప్స్ చేయించుకోలేదు. ఫలితంగా కొందరిలో కిడ్నీ సమస్యలు అధికమయ్యాయి.
ఇక లాక్‌డౌన్ సమయంలో, ఆ తరువాత కూడా చాలా కాలం వరకు హాస్పిటళ్లలో ఔట్ పేషెంట్ సేవలు నిలిచిపోయాయి. దీంతో వైద్య పరీక్షలు చేయించుకోవడం కుదరలేదు. అలాగే అవయవ మార్పిడి వంటి ఆపరేషన్లను కూడా వాయిదా వేసుకున్నారు. దీంతోపాటు కరోనా వల్ల చాలా మంది ఇళ్లలోనే ఉన్నారు. అలాగే ఉద్యోగులు గంటల తరబడి ఇండ్లలో కంప్యూటర్ల ఎదుట కూర్చుని పనులు చేస్తున్నారు. దీంతో జీవనవిధానం అస్తవ్యస్తంగా మారింది. ఫలితంగా స్థూలకాయం, డయాబెటిస్, గుండె జబ్బులు వంటి సమస్యలు చుట్టుముట్టాయి. కరోనా వల్లే చాలా మంది ఇండ్లలో ఇలా పనిచేస్తున్నందునే ఆయా అనారోగ్యాల బారిన పడ్డారని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఇక ఈ ఏడాది కాలంలో ఆయా అనారోగ్య సమస్యల కారణంగా కిడ్నీ వ్యాధుల బాధితులు కూడా పెరిగారు. అయితే ఇప్పుడు అన్ని హాస్పిటళ్లు ఇతర వైద్య సేవలను కూడా అందిస్తున్నాయి కనుక ఇప్పుడు వైద్య పరీక్షలు చేయించుకునేందుకు, చికిత్స తీసుకునేందుకు ఇబ్బంది లేదు. అయినప్పటికీ బాధితుల సంఖ్య మాత్రం రోజు రోజుకీ పెరుగుతోంది.
అయితే కిడ్నీ సమస్యలే కాదు, ఇతర ఏ అనారోగ్య సమస్యలూ రాకుండా ఉండాలన్నా పలు సూచనలు పాటించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవేమిటంటే…
* ఆరోగ్యవంతులు అయినా సరే తరచూ అన్ని విధాలైన వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. దీంతో ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంచుకోవచ్చు.
* నిత్యం అన్ని పోషకాలు కలిగిన సమతుల ఆహారాన్నితీసుకోవాలి. వేళకు భోజనం చేయాలి. దీని వల్ల కూడా అనేక అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.
* నిత్యం శారీరక శ్రమ చేయాలి. జిమ్, యోగా, మెడిటేషన్ వంటివి చేయాలి. కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేసినా చాలు. ఆరోగ్యంగా ఉంటారు.
* ఏ వైద్యుడి వద్దకు వెళ్లినా.. ఏ హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్నా.. వాటికి సంబంధించిన మెడికల్ రికార్డులను ఎప్పటికప్పుడు భద్ర పరుచుకోవాలి. దీంతో భవిష్యత్తులో ఏవైనా అనారోగ్య సమస్యలు వస్తే వైద్యులు పాత రికార్డులను పరిశీలించి అందుకు అనుగుణంగా సులభతరమైన రీతిలో చికిత్సను అందించేందకు అవకాశం ఉంటుంది. ఇలా కిడ్నీ వ్యాధులే కాదు, ఇతర అనారోగ్యాలు కూడా రాకుండా చూసుకోవచ్చు.