న్యూఢిల్లీ: బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం పార్లమెంట్ భవనంలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, తదితరులు హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో పెగాసస్ అంశంపై నెలకొన్న పరిస్థితులు, ప్రతిపక్షాల తీరుపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా, బీజేపీ జాతీయ చీఫ్ జేపీ నడ్డా ప్రత్యేకంగా భేటీకానున్నారు. దేశంలో నెలకొన్న పరిస్థితులతో పాటు కర్ణాటకలో ఏర్పడిన రాజకీయ పరిణామాలపైనా చర్చించే అవకాశం ఉంది.
మరోవైపు పెగసస్ వ్యవహారంపై ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. తమ ఫోన్లు ట్యాపింగ్ కు గురవుతున్నాయంటూ కాంగ్రెస్ నేతలు పార్లమెంట్ సాక్షిగా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. లోక్ సభ, రాజ్యసభను స్తంభింపజేస్తున్నారు. చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.