కరోనా వల్ల ఎంతో మంది ఉద్యోగాలను, ఉపాధిని కోల్పోయారు. దీంతో నెలసరి వాయిదాలతోపాటు క్రెడిట్ కార్డుల బిల్లులను చెల్లించలేకపోతున్నారు. అయితే అలాంటి వారు ఉన్న స్థితిని అర్థం చేసుకోకుండా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రికవరీ ఏజెంట్లను పంపించి వినియోగదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇక ఆ ప్రాంతంలో ఓ మహిళను అయితే రికవరీ ఏజెంట్లు తీవ్ర వేధింపులకు గురి చేశారు. ఆమె క్రెడిట్ కార్డుల బిల్లులను చెల్లించలేదని ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఈ సంఘటన ప్రస్తుతం సంచలనం రేపుతోంది.
ఔరంగాబాద్‌కు చెందిన ఓ మహిళ (29) కు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ఉంది. ఆమె సొంతంగా బొటిక్ నిర్వహిస్తోంది. 3 ఏళ్లుగా కార్డు బిల్లులను చెల్లిస్తూనే ఉంది. ఆమె భర్త జాబ్ చేస్తుంటాడు. అయితే కోవిడ్ వల్ల ఆమె బొటిక్ మూసివేయాల్సి వచ్చింది. ఆమె భర్తకు కూడా జాబ్ పోయింది. దీంతో ఆమె క్రెడిట్ కార్డు బిల్లును చెల్లించలేకపోయింది. మొత్తం రూ.21వేలు పెండింగ్ బిల్లు ఉంది.
అయితే ఎస్‌బీఐ బ్యాంకు వారు ఆమె నుంచి సొమ్మును రికవరీ చేసేందుకు ఇన్‌క్రెడిబుల్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ (ఐఎంఎస్) అనే సంస్థకు పర్మిషన్ ఇచ్చారు. దీంతో ఐఎంఎస్ కు చెందిన రికవరీ ఏజెంట్లు ఆమెను, ఆమె భర్తను వేధించ సాగారు. ఓ దశలో బిల్లు చెల్లించలేకపోతే కోరిక తీర్చి బిల్లును చెల్లు పెట్టుకోవాలని సూచించారు.
దీంతో ఆ దంపతులు పోలీసులను ఆశ్రయించారు. ఈ సంఘటన ఫిబ్రవరిలో జరిగింది. అయితే ఇప్పటికీ ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేయలేదు. ఆ దంపతులు తమను వేధింపులకు గురి చేసినట్లు అన్ని ఆధారాలు ఇచ్చినా పోలీసులు నిందితులను అరెస్టు చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు సదరు రికవరీ ఏజెంట్లు ఆ మహిళ పేరిట ఫేస్‌బుక్‌లో నకిలీ ప్రొఫైల్‌ను క్రియేట్ చేసి ఆమెకు చెందిన ఫోటోలను పెట్టి ఆమెను వేశ్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.
అయితే ఆ విషయం తెలుసుకున్న ఆ దంపతులు తమకు పరువు నష్టం జరిగిందని తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. ఇప్పటికైనా నిందితులను అరెస్టు చేయాలని వేడుకుంటున్నారు. పోలీసులు నిందితులను ఎందుకు అరెస్టు చేయడం లేదో, దాని వెనుక ఉన్న కారణమేమిటో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.