ఎన్నో ఏళ్ల నుండి మనం కృష్ణాష్టమిని జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి శ్రావణ బహుళ అష్టమి రోజున వస్తుంది. ఈసారి ఆగస్టు 30 వ తేదీన వచ్చింది. ఈ రోజు ఉదయాన్నే నిద్ర లేచి అభ్యంగన స్నానం చేసిన తర్వాత గుమ్మానికి తోరణాలు కట్టి.. గడపకి పసుపు కుంకుమలు అద్ది.. పూజ గదిలో ముగ్గులు వేసి అందంగా అలంకరిస్తారు. అలానే చాలా మంది శ్రీ కృష్ణుడు పాదాలని ముగ్గుతో వేస్తారు.
అలానే ఇంట్లో ఉండే చిన్నారులని కృష్ణుడిలా తయారుచేసి సరదాగా ఈ రోజును గడుపుతారు. కృష్ణాష్టమి రోజు పూజ చేయడం.. ఆ తర్వాత కృష్ణుడిని స్మరించుకోవడం కూడా ముఖ్యం. శ్రీకృష్ణుడి గొప్పతనాన్ని చాటి చెప్పే భాగవతం భగవద్గీతలను పఠించడం కూడా శుభ ఫలితాలను ఇస్తుందని భక్తులు నమ్మకం.
అలా కృష్ణుని తలచీ కొలిచి ఆ రోజంతా ఉంటే కృష్ణుడి అనుగ్రహం కలుగుతుందని అంటారు కొందరైతే రాత్రివేళల్లో కృష్ణుడికి పూజ చేసి భజన చేస్తారు. మరి కొందరైతే ఉపవాసాన్ని కూడా చేస్తారు. పల్లెటూర్లలో వీధుల్లో ఉట్టి కొట్టడం.. ముగ్గులు పోటీలు వంటివి కూడా నిర్వహిస్తారు. కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి పాలు, పెరుగు, వెన్న, అటుకులు, పండ్లు మొదలైన వాటిని నైవేద్యంగా పెడతారు. మరికొందరైతే హోలీ తరహాలో గులాల్ చల్లుకుంటూ ఉంటారు. ఇలా ఎవరి పద్ధతి ప్రకారం వాళ్ళు కృష్ణుని కొలిచి అనుగ్రహం పొందుతారు. ఉయ్యాలలో కృష్ణుని వేసి ఊపుతూ పాటలు పాడతారు. ఇలా సాంప్రదాయాల ప్రకారం అనుసరించి రోజంతా శ్రీకృష్ణుడిని స్మరించుకుంటారు.