ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలోని ఓ గ్రామ ప్రజలు ఉత్సవంలో చికెన్ వండుకుని తినగా తీవ్రఅస్వస్థతకు గురయ్యారు. దాంతో వారికి స్థానిక వైద్యులు చికిత్స అందించగా కోలుకున్నారు. అయితే తాజాగా మటన్ తిని 20 మంది అస్వస్థతకు గురైన సంఘటన విశాఖ ఏజెన్సీలో చోటు చేసుకుంది. విశాఖ ఏజెన్సీలోని జీకే వీధి మండలం బోనంపల్లి గ్రామంలో గ్రామస్థులంతా కలిసి ఒక మేకను కొనుక్కుని వండుకుని తిన్నారు.

అయితే మటన్ తిన్న తరవాత ఆ గ్రామంలోని ప్రజలకు ఒక్కొక్కరిగా వాంతుఉ మొదలైనట్టు సమాచారం. ఇక మొత్తం 20 మందికి వాంతులు కాగా వారిలో ఓ మహిళ స్పృహ కోల్పోయింది. ఆ తరవాత ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా మరో ముగ్గురి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు సమాచారం. మటన్ తిన్న 20 మంది ప్రజలకు కూడా డయేరియా సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం వారికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.