ఐపీఎల్ 2019.. ఈసారి ప్రారంభోత్సవ వేడుకలు లేవు.. ఎందుకంటే?

-

IPL opening ceremony cancelled

ఐపీఎల్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్.. భారత్‌లో దీనికున్న క్రేజ్ దేనికీ లేదని చెప్పొచ్చు. క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ వచ్చిందంటే సంక్రాంతి, దసరా, దీపావళి పండుగలు ఒకేసారి వచ్చినంత సంబురం. సమ్మర్ ఎంత హాట్‌గా ఉన్నా.. ఐపీఎల్ వల్ల ఎండ వేడిని కూడా మరిచిపోయి.. ఐపీఎల్‌లో క్రికెట్‌ను ఎంజాయ్ చేస్తుంటారు క్రికెట్ అభిమానులు. ఐపీఎల్‌కు అంత క్రేజ్ మరి. ఇప్పటికే ఐపీఎల్ షెడ్యూల్ కూడా రిలీజ్ అయింది. మార్చి 23 నుంచి ఐపీఎల్ సీజన్ 12 స్టార్ట్ అవుతుంది.

అయితే.. ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకలు ఈసారి లేవట. ప్రతిసారి ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేవారు. సినిమా సెలబ్రిటీల ఆటపాటలు, క్రీడాకారులు డ్యాన్సులు, క్రికెట్ అభిమానుల సందడితో ఐపీఎల్‌ను గ్రాండ్‌గా ప్రారంభిస్తారు. ఈ సీజన్‌లో మాత్రం ప్రారంభోత్సవ వేడుకలను రద్దు చేస్తున్నట్టు కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ ప్రకటించింది. పుల్వామా ఉగ్రదాడిలో జవాన్ల మృతికి సంతాపంగా ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకలను నిర్వహించడం లేదని.. ప్రారంభోత్సవ వేడుకల కోసం కేటాయించిన డబ్బును అమరుల కుటుంబాలకు అందించనున్నట్లు ప్రకటించింది. ఇవాళ బీసీసీఐ, సీఓఏ అధికారులు భేటీ అయి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సీఓఏతో పాటు.. బీసీసీఐ కూడా మద్దతు ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news