యాభై ఏళ్ల దసరా బుల్లోడుకి
ఐదేళ్ల సోగ్గాడు తోడు
యాభై ఏళ్ల ఆ సినిమా జీవితానికి
మరో ఐదేళ్ల రంగుల రాట్నం తోడు
కాలం కరిగిపోతే బంగార్రాజు
గొప్పవాడు అయిపోతాడు
కాలం ఆగిపోతే బంగార్రాజు మన జ్ఞాపకం
అయి ఉంటాడు
ఏనాడూ అనుకోలేదే కనుకే నువ్ తోడైనావే అని అన్నారు సోగ్గాడే చిన్ని నాయనాలో! ఇప్పుడు అదే బంగార్రాజు మన అందరి లోగిళ్లకూ మరో సారి వచ్చేశాడు.పాటకు ప్రాణం అయి నిలిచిన కాలం ఇప్పుడు అదే ప్రాణాన్ని మరోమారు మనం అందరం
గుర్తుకు ఉంచుకునేలా ప్రాణ ప్రదం అయిన జ్ఞాపకం అని గుర్తించేలా చేశారు దర్శకులు కల్యాణ్ కృష్ణ. ఈ సినిమాతో కొన్ని సినిమాల జీవితాల మారుతాయి. రాతలు మారి తలరాతలు కూడా చెరిగిపోతాయి. కొంత కాలంగా అవస్థ పడుతున్న తెలుగు సినిమాకు మరో ఊపిరి..శ్వాసకు శ్వాస జత. కొన ఊపిరికి మరికొంత ఊపిరి చేరిస్తే ఏమౌతుంది.. ప్రాణం నిలబడుతుంది..ఆ విధంగా ఈ సినిమా తెలుగు లోగిళ్లలో స్వచ్ఛమయిన పైరగాలి..ఊపిరి ఆడని జీవితాలకు ఉపశమనం. ఉక్కపోతల కాలం ఇంకా
రాలేదు కానీ అప్పుడు కూడా ఈ సినిమా మరింత చల్ల గాలి.. గోదావరి తరగలపై నుంచి వీచే గాలి.ఆ చిరుగాలి సవ్వళ్ల చెంత బంగార్రాజు అచ్చతెలుగు పట్టు పంచెతో మెరిసిపోతున్నాడు… మీరు వెళ్లి పలకరించి రండి మీ దగ్గర థియేటర్లలోనే ఉన్నాడు మరి!