త్వరలో రానున్న వినాయక చవితి పండుగ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మట్టి విగ్రహాల పంపిణీకి జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. ‘ ఎకో ఫ్రెండ్లీ వినాయక ప్రతిమలను పూజించండి…పర్యావరణాన్ని పరిరక్షించిండి’ అనే నినాదంతో జీహెచ్ఎంసీ ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఇప్పటికే నగరంలో ప్లాస్టిక్ వాడకంపై కలిగే అనార్థాలను అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా ప్లాస్టిక్ నిషేధం, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో జల వనరులు కులుషితమవుతున్నాయనే అంశాన్ని ప్రజలకు వివరిస్తున్నారు. మట్టి విగ్రహాల తయారీకి సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తయిందని జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ తెలిపారు. ప్రత్యేక కేంద్రాలు, స్వచ్ఛంద సంస్థలు, కాలనీ సంఘాల ద్వారా పంపిణీ చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరు సహకరిస్తూ.. ఇతరులకు అవగాహన కల్పించాలని ఆయన కోరారు.