ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉన్నట్టు సమాచారం. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మే నెలలో 2వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే పదో తరగతి పరీక్షలను రెండో తేదీ నుంచి 9వ తేదీకి మార్చాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందని సమాచారం. కాగ జేఈఈ మెయిన్ పరీక్షల కారణంగా ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలను కూడా వాయిదా వేశారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మార్చిన షెడ్యూల్ ప్రకారం.. ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 22 నుంచి మే 12 వ తేదీ వరకు జరగనున్నాయి. కాగ పదో తరగతి పరీక్షల ప్రస్తుత షెడ్యూల్ మే 2వ తేదీ నుంచి 13 వ తేదీ వరకు జరగనున్నాయి. అయితే పదో తరగతి, ఇంటర్ పరీక్షలను ఒకే సారి నిర్వహించడం కాస్త కష్టంతో కూడుకుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. పోలీసు బందోబస్తుతో పాటు ప్రశ్న పత్రాలను భద్రపర్చడం, ఆరోగ్య సిబ్బంది, పరీక్ష కేంద్రాల కొరత, సిబ్బంది కొరత తో పాటు ఇతర సమస్యలు ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది.
దీంతో పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. కాగ ఈ ఏడాది నుంచే తొలిసారి పదో తరగతి విద్యార్థులు పదకొండు పరీక్షలకు బదులు.. ఏడు పరీక్షలే రాస్తున్నారు.