నాలుగేళ్ల క్రితం జమ్ము కశ్మీర్ లో ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆర్టికల్ 370ని రద్దు చేసిన క్రమంలో జమ్ము కశ్మీర్ లో హింస చెలరేగింది. దీంతో ఆర్టికల్ 370 రద్దు వళ్ల జమ్ము కాశ్మీర్ లో ఉగ్రవాదం పెరిగే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం నేడు పార్లమెంట్ లో కశ్మీర్ లో ఉన్న ఉగ్రవాదంపై కీలక ప్రకటన చేసింది. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత.. జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాదం దాదాపు 45 శాతం వరకు తగ్గిందని పార్లమెంట్ లో కేంద్ర హోం శాఖ సహయ మంత్రి నిత్యానంద్ రాయి ప్రకటించారు.
జమ్ము కశ్మీర్ లో 2018 లో 517 ఉగ్రవాద ఘటనలు జరిగాయని అన్నారు. అలాగే 2021 వచ్చే సరికి 229కి తగ్గిపోయాయని తెలిపారు. అలాగే 2019 ఆగస్టు 5 నుంచి 2021 వరకు జరిగిన ఉగ్ర దాడుల్లో 87 మంది పౌరులు చనిపోగా.. 99 మంది భద్రతా సిబ్బంది మరణించారని అన్నారు. అలాగే 2014 నుంచి 2019 వరకు జరిగిన ఉగ్రదాడుల్లో 177 మంది పౌరులు మరణించగా.. 406 మంది భద్రతా సిబ్బంది చనిపోయారని వెల్లడించారు. ఈ నాలుగేళ్లలో 45 శాతం ఉగ్రవాద దాడుల తో పాటు మరణాల సంఖ్య కూడా భారీగా తగ్గాయని అన్నారు.