తెలంగాణలో ఎండల తీవ్రత పెరిగింది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం 10 దాటితే ఇళ్ల నుంచి బయటకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. ఎప్రిల్ నెల మొదట్లోనే ఇలా ఉంటే పరిస్థితి మేలో ఏ విధంగా ఎండలు మండిపోతాయో అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు అత్యవసరం అయితేనే తప్ప ఇళ్ల నుంచి బయటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. రాష్ట్రంలో రానున్న రెండు, మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో నిన్న 25 జిల్లాల్లో 40 డిగ్రీల కన్నా అధిక ఉష్ణోగ్రత నమోదైంది. గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్ జిల్లాలో 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండు మూడు రోజుల్లో ఇది మరింతగా పెరుగుతుందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
గడిచిన 24 గంటల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ లో 42.9 డిగ్రీలు, పిప్పల్ దరిలో 42.6 డిగ్రీలు, కామారెడ్డి జిల్లా కొల్లూర్ లో 42.5 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా భోరజ్ లో 42.4 డిగ్రీలు, కుమ్రం భీం జిల్లా కెరిమెరిలో 42.2 డిగ్రీలు, నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ లో 42.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.