నో రిజర్వేషన్ నో క్యాస్ట్ నో రిలిజియన్
అన్నవి ఇప్పుడొక నినాదంగా మారుతున్నాయి
ఇలాంటి ఆశావహ దృక్పథాన మళ్లీ తిరుగామి ఆలోచనలు
ఎందుకు ? కాంగ్రెస్ కేవలం ఓటు బ్యాంకు చూసుకుంటే
చాలా ? మిగిలిన విషయాల మాటేంటి ?
ఉదయ్ పూర్ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ ఓ వివాదాన్ని నెత్తిన పెట్టింది. అసలు బాబా సాహేబ్ అంబేద్కర్ అన్న విధంగా రిజర్వేషన్ అన్నది కొంత కాలం వరకూ ఉంచి తరువాత తీసేయ్యాలి అని చెప్పిన విధంగా అమలు చేస్తే బాగుంటుంది. కానీ అట్టడుగు వర్గాల ఉన్నతి అన్నది ఇంకా సాధ్యం కానుందన తప్పక రిజర్వేషన్లు అన్నవి అమలు అవుతున్నాయి అన్నది ఓ వాదన. పాలక వర్గాల తప్పిదాల కారణంగా సమాన అవకాశాల సృష్టి అన్నది ఇవాళ జరగడం లేదు. ఈ దశలో రిజర్వేషన్ల అమలు అన్నది అనివార్యం అయి నిలుస్తోంది.
ఇది ప్రభుత్వ రంగం వరకూ.. కానీ ప్రయివేటు రంగాన మాత్రం అలా కాదు. అందుకు భిన్నంగా రిజర్వేషన్లు కాదు ప్రతిభ అన్నది కీలకం మరియు ప్రామాణికం అన్న విధంగా జీతభత్యాల చెల్లింపులు కానీ సంబంధిత కేటాయింపులు కానీ లేదా నియామకాలు కానీ జరుగుతున్నాయి. ఇప్పుడు రగులుతున్న కొత్త చిచ్చు కారణంగా ఆ రంగంలోనూ కొన్ని సమస్యలు అనూహ్యంగా తలెత్తేందుకు ఆస్కారం లేకపోలేదు. కేవలం రాజకీయ ఉనికి కోసం ఇలాంటివి చేయడం తగదని కొందరు న్యాయ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు.
మతం వద్దు – గితం వద్దు – మారణ హోమం వద్దు అన్నది కవి మాట. కానీ మతం కానీ కులం కానీ రాజకీయాలకు అవసరం అన్నదే నేటి యుక్తిపూర్వక మాట. ఉద్దేశం ఎలా ఉన్నా ఎవరి స్వార్థం వారిదే అన్న నిరూపణకు తూగే మాట. ఆ విధంగా దేశంలో ప్రయివేటు సంస్థల్లో కంపెనీల్లో రిజర్వేషన్లు కల్పించాలన్న మాట కొత్త వివాదానికి తెర తీస్తోంది. వద్దంటే వద్దు అన్న వాదన ఒకటి వినిపిస్తోంది. ఇప్పటికే ప్రతిభ కు కాస్తో కూస్తో మద్దతు దక్కుతున్నది ఒక్క ప్రయివేటు రంగంలోనే ! కులం, మతం అన్నవి చూడకుండా మానవ వనరులను వినియోగించుకుని, ఉత్పత్తి రంగాలు పురోగమిస్తున్నది కూడా అక్కడే ! వాటిని కాదని కనీస స్థాయిలో కూడా నోటిఫికేషన్లు వేయలేని దుఃస్థితిలో ఉన్న స్థానిక ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ తరుణంలో కొత్తగా ఈ నాటకం మొదలుపెట్టడం భావ్యం కాదని కొందరు యాక్టివిస్టులు ఆందోళన చెందుతున్నారు.
ఎందుకయ్యా సంపుతరు మమ్మల్ని అని అంటున్నాయి సోషల్ మీడియా వర్గాలు. యాక్టివిస్టులు కూడా ! కులాల కుంపటి ఒకరిది..మతాల రగడ ఇంకొకరిది అన్న విధంగా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ రాజకీయం చేయడం దేశానికి సంబంధిత భవిష్యత్- కూ ఎటువంటి మేలూ చేయదని అంటున్నాయి కొన్ని ప్రజాస్వామిక శక్తులు. ఏదేమయినప్పటికీ ప్రయివేటు రంగాన కులాల పేరిట రిజర్వేషన్లు అంటూ కొత్త అంకానికి తెర తీసిన కాంగ్రెస్ ఇకపై అదే పనిగా దీనిపైనే మాట్లాడి ఉదయ్ పూర్ డిక్లరేషన్ పేరిట మరో విద్వేషాగ్ని రగల్చడం ఖాయం.