గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ధవళేశ్వరం కాటన్ బ్యారేజీలో ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో పెరిగింది. గురువారం రాత్రి 12 గంటల సమయానికి బ్యారేజీలో నీటి మట్టం 16.70 అడుగులకు చేరి.. 17,53,251 క్యూసెక్కుల జలాలు వస్తుంటే.. అదేస్థాయిలో కడలికి వదులుతున్నారు. కాళేశ్వరం నుంచి భద్రాచలానికి వరద చేరుకోవడానికి 25 నుంచి 30 గంటలు పడితే.. భద్రాచలం నుంచి ధవళేశ్వరం బ్యారేజీకి వరద చేరుకోడానికి 15 నుంచి 18 గంటలు పడుతుందని అంచనా వేస్తున్నారు. ఎగువన వర్షాలు, వరద ప్రవాహం ఆధారంగా శుక్రవారం మధ్యాహ్నం నుంచి వరదతీవ్రత మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నారు జలవనరుల శాఖ అధికారులు. ప్రవాహం 25 లక్షల క్యూసెక్కులు దాటితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టిసారించారు అధికారులు.
ఇప్పటికే బలహీనంగా గట్లు ఉన్న ప్రాంతాల్లో ఇసుక బస్తాలు, ఇతర సామగ్రి అందుబాటులో ఉంచి పర్యవేక్షణ పెంచారు అధికారులు. కోనసీమ జిల్లాలో 20, తూగో జిల్లాలో 8, కాకినాడ జిల్లాలో 2 మండలాలపై వరద ప్రభావం పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ అంచనా వేసింది. కోనసీమ జిల్లాలో ఇప్పటికే 37, తూర్పుగోదావరి జిల్లాలో 6, పశ్చిమగోదావరి జిల్లాలో 13 లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకోవడంతో రాకపోకలు స్తంభించాయి. సహాయక చర్యలపై కలెక్టర్లు దృష్టిసారించారు. బ్యారేజీతోపాటు లంక గ్రామాల పరిస్థితిని ఎప్పటికప్పుడు స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్‌లోని కంట్రోల్‌రూమ్ నుంచి విపత్తుల నిర్వహణ
విభాగం పర్యవేక్షిస్తోంది.