తాజాగా వర్షాకాలం కొనసాగుతున్న నేపథ్యంలో వానల కారణంగా దోమల బెడద ఎక్కువవుతుంది. ఫలితంగా డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు కూడా వచ్చే అవకాశం లేకపోలేదు. అయితే ఈ వర్షాకాలంలో మీరు రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలి అంటే సరైన ఆహార పదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీ శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి సీజనల్ వ్యాధులతో పోరాడే శక్తి మీ శరీరానికి లభిస్తుంది. ఇకపోతే మన ఆరోగ్యాన్ని పెంపొందించే ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.
నిమ్మకాయ:
నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా లభించడం వల్ల రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇక వీటిని తరచూ తీసుకుంటే జీవక్రియ రేటు కూడా మెరుగుపడుతుంది. ఎముకలను బలోపేతం చేయడానికి కూడా నిమ్మరసం చాలా చక్కగా సహాయపడుతుంది.
వెల్లుల్లి:
ఔషధ గుణాలు ఎక్కువగా లభించే వెల్లుల్లిని తినడం వల్ల శరీరానికి కావలసిన రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా సీజనల్ వ్యాధులు దరిచేరవు. వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి కూడా మన శరీరాన్ని కాపాడుతుంది.
పాలకూర:
అన్ని రకాల ఆకుకూరల్లో మంచి పోషక విలువలు ఉంటాయని అందరికీ తెలిసిందే. వాటిలో ముఖ్యంగా పాలకూరను ఈ కాలంలో ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక పాలకూరలో బీటా కెరటిన్, యాంటీ ఆక్సిడెంట్, ఫైబర్, ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు ఉండడం వల్ల శరీరాన్ని కావాల్సిన అన్ని ప్రయోజనాలు లభిస్తాయి. అలాగే విటమిన్ ఏ , విటమిన్ ఈ, విటమిన్ సి కూడా తగిన మోతాదులో లభిస్తాయి.
నట్స్:
జీడిపప్పు, బాదం వంటి ఇతర గింజలలో రైబోఫ్లేవిన్, నియాసిన్, విటమిన్ ఈ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇక ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయి.
ఇక వీటితో పాటు అల్లం కూడా తీసుకోవడం వల్ల మరింత రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు.