మా ఇంట్లో నా ఫేవరెట్ ప్లేస్ బెడ్ రూం. ఆ రూమ్ లో కిటికీ దగ్గర ఉన్న బెడ్ నాకు చాలా ఇష్టం. కిటికీ వైపు తలపెట్టి పడుకోడం అంటే నాకు చాలా ఇష్టం. కానీ మా అమ్మ మాత్రం అటువైపు తలపెట్టి నిద్రపోకూడదు అంటుంది. ఎందుకంటే అటు దేవుడు ఉంటాడు. దేవుడి వైపు కాళ్లు పెట్టడం తప్పు అని. నానమ్మ ఏమో.. ఉత్తరం వైపు తల పెట్టొద్దు అని చెబుతుంది. ఇలా నాకు మాత్రమే కాదు ఈ సమస్య చాలా మందికి ఎదురై ఉంటుంది. కేవలం ఇల్లు, కార్యాలయాలకే కాదు మనుషులు చేసే కొన్ని పనులకు కూడా వాస్తు ఉంటుందట. ఆ వాస్తు ప్రకారం లేకపోతే జీవితంలో సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు వస్తాయట. మరి ఏ దిక్కున తల పెట్టి పడుకోవాలో తెలుసుకుందామా..!
నిద్ర సరిగ్గా లేకపోతే మరుసటి రోజంతా చిరాగ్గా ఉంటుంది. ఆ చిరాకులో తినాలనిపించదు. ఫలితంగా ఆరోగ్య సమస్యలు. అందుకే ప్రశాంతంగా సరిపడా నిద్రపోవాలని సూచిస్తుంటారు డాక్టర్లు. అయితే నిద్రించేటప్పుడు మీరు ఏ దిక్కులో నిద్రిస్తున్నారనేది కూడా చాలా ముఖ్యమట. నిద్రించే దిశ వల్ల తప్పుగా ఉంటే మీరు ప్రశాంతత కోల్పోవడమే కాదు తరచూ అనారోగ్యాలు, కుటుంబంలో కలహాలు వస్తాయట.
వాస్తు శాస్త్రం ప్రకారం దక్షిణ దిశలో తల పెట్టి నిద్రించడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ దిశలో తలపెట్టి నిద్రించడం వల్ల మానసిక సమస్యలు దూరం అవుతాయని వాస్తు పండితులు చెబుతున్నారు. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుందని అంటున్నారు. దక్షిణం వైపు పాదాలను పెట్టి నిద్రపోకూడదు.. అది అశుభం. మన పాదాలను దక్షిణం వైపు పెట్టి పడుకోవడం వల్ల మనలో రక్త హీనత ఏర్పడుతుందని వాస్తు శాస్త్రం అంటోంది.
మీరు దక్షిణం వైపు తల పెట్టి నిద్రించలేకపోతే, తూర్పు వైపు తల పెట్టి నిద్రించడానికి ప్రయత్నించండి. దక్షిణం తర్వాత తూర్పు వైపుకు వెళ్లడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల సూర్యభగవానుని అనుగ్రహం లభిస్తుంది. ఇతర దేవతల ఆశీస్సులు కూడా ఉంటాయని చెబుతారు. అటువంటి పరిస్థితిలో, ఈ రోజు నుండి దక్షిణం వైపు కాకపోయినా.. ఖచ్చితంగా తూర్పు వైపు తల పెట్టి నిద్రించండి.
ఇంట్లో ఒంటరిగా సంపాదించే వారు తూర్పున తలపెట్టి పడుకోవడం మంచిదని విశ్వాసం. ఇలా చేయడం వల్ల ఆర్థికంగా అభివృద్ధి చెందుతారట.. డబ్బుకు సంబంధించిన సమస్యలను కూడా చాలా వరకు అధిగమించవచ్చని అంటున్నారు వాస్తు పండితులు. చదువుకునే వారు కూడా తూర్పు దిక్కున తల పెట్టి నిద్రించాలి. తూర్పు వైపు తల పెట్టి పడుకోవడం వల్ల విద్యార్థి చదువుల పట్ల మొగ్గు చూపడంతో పాటు ఏకాగ్రత కూడా పెరుగుతుంది.
చాలా మంది తమ పాదాలను ఆలయం వైపునకు, ఇంట్లో ఉండే దేవుడి గుడి గదివైపు పెట్టి పడుకుంటారు. ఇలా చేయడం సరికాదు. ఇది చాలా అశుభం.. ఆలయం వైపు మీ పాదాలతో నిద్రపోకుండా ప్రయత్నించండి.