యాదాద్రీశుడి సన్నిధిలో ప్రసాదం కోసం భక్తుల తిప్పలు

-

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో అసౌకర్యాలతో భక్తులు నానాతంటాలు పడుతున్నారు. స్వామి దర్శనం కోసం వచ్చిన వారంతా ఇబ్బందులతో సతమతమవుతున్నారు.  పెద్దఎత్తున భక్తులు వచ్చిన ప్రతిసారి తిప్పలు తప్పడం లేదు.

ఆదివారం యాదాద్రి క్షేత్రానికి సుమారు 40 వేల మంది భక్తులు రాగా వారికి సరిపడా లడ్డూ ప్రసాదాన్ని దేవస్థానం అధికారులు అందించలేకపోయారు. తక్కువ కౌంటర్ల ద్వారా విక్రయాలు జరపడంతో నిరీక్షించలేక, ఓపిక నశించి, అసహనానికి గురైన భక్తులు అధికారులు, సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ప్రసాద విక్రయ కేంద్రంలోని కౌంటర్ తలుపులు తెరిచేందుకు, తోసుకురావడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. సకాలంలో ఎస్పీఎఫ్ పోలీసులు, ఇతర సిబ్బంది అక్కడికి చేరుకొని భక్తులను సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది.

భక్తులు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయంగా అనుబంధ ఆలయమైన పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నుంచి సిబ్బంది తయారు చేస్తున్న లడ్డూలను కొండపైకి తరలిస్తున్నారు. వారాంతపు సెలవైన ఆదివారం భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో లడ్డూలకు కొరత ఏర్పడుతోంది. పులిహోర, వడ ప్రసాదం మాత్రం యంత్రాలతో తయారు చేస్తున్నారు. లడ్డూ ప్రసాదం దొరకకపోవడంతో కొందరు భక్తులు పులి హోరతోనే సరిపుచ్చుకొని వెళ్తున్నారు. యాదాద్రి లడ్డూ పై భక్తజనులకు అమితమైన విశ్వాసం ఉంది. స్వామివారి ప్రసాదం అందకపోవడంపై వారు అసహనంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news