ఈ గణేశుడు వెరీ రిచ్, కేవలం మండపానికే రూ.316 కోట్లతో…
గణపతి నవరాత్రి ఉత్సవాలకు యావత్ దేశం ముస్తాబవుతోంది. విభిన్న ఆకృతుల్లో వినాయకుల విగ్రహాలు కూడా సిద్ధమైపోయాయి. వీటి తరలింపునకు సంబంధించిన వాహనాలతో దేశవ్యాప్తంగా కోలాహలం నెలకొంది. విగ్రహాలకు ప్రాణప్రతిష్ట చేసి పూజలు చేసేందుకు మండపాలు కూడా సిద్ధమైవుతున్నాయి. కొన్నిచోట్ల ఖరీదైన గణేశ్ మూర్తులను ఏర్పాటు చేస్తుండగా, మరికొన్ని చోట్ల భారీ సెట్టింగ్లతో తాత్కాలిక మండపాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంబయిలోని ఓ గణేశ్ మండపానికి ఏకంగా రూ.316 కోట్లకు ఇన్సూరెన్స్ చేయించారు. ఆ సంగతులను తెలుసుకుందాం..
ముంబయిలోని కింగ్స్ సర్కిల్లో జీఎస్బీ సేవా మండల్ నగరంలోనే అత్యంత ఖరీదైన మండపంగా నిలిచింది. ఆ మండపం బాధ్యతలు చూసేవారితో పాటు అక్కడకు వచ్చే భక్తులకు అక్కడి నిర్వాహకులు భారీ బీమా చేయించారు.
ఇందుకోసం రూ.316కోట్ల మొత్తానికి ఇన్సూరెన్స్ చేయించగా.. ఇందులో రూ.31.97కోట్లు మండపంలోని బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులు ఈ పరిధిలోకి వస్తాయి. మరో రూ.263 కోట్లు మాత్రం మండపానికేనని నిర్వాహకులు వెల్లడించారు. వలంటీర్లు, పూజారులు, వంటవాళ్లు, చెప్పులు భద్రపరిచేవారు, పార్కింగ్, సెక్యూరిటీ సిబ్బంది ఈ బీమా కిందకు వస్తారు. అగ్నిప్రమాదం, భూకంపం ముప్పు వంటి వాటికోసం ప్రత్యేకంగా మరో కోటి రూపాయల బీమా తీసుకున్నారు. వీటిలోకి అక్కడి ఫర్నీచర్, కంప్యూటర్లు, సీసీటీవీలు, స్కానర్ల వంటివి వస్తాయి.
“మండప నిర్వాహకులతో పాటు ఈ గణేశుడిని దర్శించుకునేందుకు వచ్చే ప్రతి భక్తుడికి బీమా కల్పించాం” అని జీఎస్బీ సేవా మండల్ ఛైర్మన్ విజయ్ కామత్ పేర్కొన్నారు. గత 68 ఏళ్లుగా ఇక్కడ వినాయకుడిని ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడకు వచ్చే ప్రతి భక్తుడికి భద్రత కల్పించడం మా బాధ్యత అని విజయ్ కామత్ వివరించారు.
వినాయక చవితి మొదలు 10రోజుల పాటు ఇక్కడి నిర్వాహకులు, భక్తులకు ఈ బీమా వర్తిస్తుందన్నారు. ఏటా ఇటువంటి ఇన్సూరెన్స్ తీసుకుంటున్నప్పటికీ ఈసారి రికార్డు స్థాయిలో గరిష్ఠ మొత్తానికి బీమా చేయించినట్లు మండపం నిర్వాహకులు వెల్లడించారు.