విజయవాడ ఇంద్రకీలాద్రిలో విషాదం చోటుచేసుకుంది. దుర్గమ్మ దర్శనానికి వెళ్లిన ఓ భక్తుడు క్యూలైన్ లో మృతి చెందాడు. రూ.500 దర్శన క్యూలైన్‌లో భక్తుడు అస్వస్థతకు గురయ్యాడు. ఫిట్స్ రావడంతో ఒక్కసారిగా కుప్పకూలాడు. గమనించిన ఆలయ సిబ్బంది అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే మరణించాడు. మృతుడు హైదరాబాద్ వాసి మూర్తిగా గుర్తించారు.
మరోవైపు ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదోరోజు లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో కనకదుర్గమ్మ దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. దీంతో ఆలయం వద్ద క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. లలితా త్రిపుర సుందరీదేవిని దర్శించుకుంటే సకల ఐశ్వర్యప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం.