వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల హఠాత్తుగా దిల్లీకి పయనమయ్యారు. బీజేపీ పెద్దలను కలిసేందుకే ఆమె హస్తినకు వెళ్తున్నట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని వాటిపై ఆధారాలు బీజేపీ పెద్దలకు ఇస్తారని వైఎస్ఆర్‌టీపీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే పాదయాత్ర నిలిపివేసి మరీ రెండు రోజుల పర్యటనకు దిల్లీ వెళ్తున్నట్లు వెల్లడించాయి.
అయితే కాళేశ్వరం గురించి అన్ని ఆధారాలు ఇప్పటికే బీజేపీ వద్ద ఉన్నాయని.. షర్మిల కచ్చితంగా రాజకీయ పరమైన అంశాల గురించి చర్చించేందుకే దిల్లీ వెళ్తున్నారన్న మాట వినిపిస్తోంది. ఇటీవలే తన తండ్రిని కుట్ర చేసి చంపారని తనను కూడా చంపే అవకాశాలున్నాయని షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలన్నింటి మధ్య బీజేపీ నేతలతో చర్చల కోసం దిల్లీ వెళ్లడం తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామంగా కనిపిస్తోంది. దిల్లీలో ఏ స్థాయి బీజేపీ నేతలతో సమావేశం అవుతారన్నదానిపై క్లారిటీ లేదు.