ఉక్రెయిన్‌పై రష్యా ‘డర్టీబాంబ్‌’ ఆరోపణలు.. రంగంలోకి ఐఏఈఏ

-

ఉక్రెయిన్‌పై రష్యా చేసిన ‘డర్టీ బాంబ్‌’ ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ వ్యవహారం తేల్చేందుకు ‘ఇంటర్నేషనల్‌ అటామిక్‌ ఎనర్జీ ఏజెన్సీ’ తనిఖీ నిపుణులు రంగంలోకి దిగారు. ఉక్రెయిన్‌లోని రెండు చోట్ల వారు తనిఖీలు చేపట్టారు. ఉక్రెయిన్‌ కోరిక మేరకే వీటిని చేపట్టినట్లు ఐఏఈఏ డైరెక్టర్‌ జనరల్‌ రఫెల్‌ గ్రోసీ తెలిపారు. అక్కడ అనధికారిక రేడియోయాక్టివ్‌ మెటీరియల్‌ దొరకలేదని పేర్కొన్నారు.

రష్యా ప్రభుత్వ రంగ వార్తా సంస్థ ఆర్‌ఐఏ నొవస్టీ మాత్రం డెనిప్రోపెట్రోవ్‌స్క్‌లోని ఈస్ట్రన్‌ మినరల్‌ ఎన్‌రిచ్‌మెంట్‌ ప్లాంట్‌, కీవ్‌లోని ‘ది ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ నూక్లియర్‌ రీసెర్చ్‌’లో ఉక్రెయిన్‌ అణుకార్యక్రమాలకు చేస్తోందని పేర్కొంది. పశ్చిమ దేశాల మద్దతుతో ఉక్రెయిన్‌ కవ్వింపు చర్యలకు పాల్పడే అవకాశం ఉందని రష్యా భావిస్తోంది.

పశ్చిమ దేశాల నుంచి ఉక్రెయిన్‌కు అందుతున్న సాయాన్ని నెమ్మదింపజేయడం లేదా పూర్తిగా రద్దు చేయించడం కోసం రష్యా ఈ ఆరోపణలు చేస్తోందని ఐఎస్‌డబ్ల్యూ (ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వార్‌ స్టడీస్‌) అంచనా వేసింది. లేకపోతే రష్యానే ఫాల్స్‌ఫ్లాగ్‌ ఆపరేషన్‌చేసి ఉక్రెయిన్‌లో డర్టీ బాంబ్‌ను పేల్చే అవకాశముందని అభిప్రాయపడింది. అప్పుడు నింద ఉక్రెయిన్‌పైనే మోపవచ్చునని భావిస్తోంది.

అసలు డర్టీ బాంబ్ అంటే ఏంటంటే..? డర్టీబాంబ్‌లో యురేనియం వంటి రేడియోధార్మిక పదార్థాలను వినియోగిస్తారు. దీనిలో అణుబాంబుల్లో వాడే శుద్ధి చేసిన రేడియోధార్మిక పదార్థాలను వినియోగించరు. వైద్యశాలలు, అణు విద్యుత్తు కేంద్రాలు, పరిశోధనశాలల నుంచి తక్కువస్థాయి రేడియోధార్మిక పదార్థాలను సేకరిస్తారు. వాటిని సంప్రదాయ పేలుడు పదార్థాలతో కలిపి పేల్చి వాతావరణంలోకి వెదజల్లుతారు. అత్యంత చౌకగా.. అణ్వాయుధాల కంటే వేగంగా వీటిని తయారు చేయవచ్చు. వీటిని సాధారణ వాహనాల వెనుక ఉంచి కూడా తరలించవచ్చు. దీనిలోని రేడియోధార్మిక పదార్థాలు గాలిలో చాలా దూరం వ్యాపిస్తాయి.

‘రేడియోధార్మికత కేన్సర్‌ వంటి తీవ్రమైన అనారోగ్యాలను కలిగిస్తుంది. అంతేకాదు.. ప్రజల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తుంది. ఈ బాంబు పేలిన ప్రదేశం నుంచి చుట్టుపక్కల చాలా భూభాగాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. దీనిని డీకంటామినేషన్‌ చేయడం లేదా.. కొన్నేళ్లపాటు ఖాళీగా వదిలేయడం చేయాలి’ అని నిపుణులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news